
Corona: 2020 జులై నుంచి మార్చురీలోనే ఆ రెండు మృతదేహాలు..!
కొవిడ్ మిగిల్చిన విషాదానికి మరో ఉదాహరణ
బెంగళూరు: కరోనా సృష్టించిన విలయం.. ఎన్నో హృదయ విదారక ఘటనల్ని మన కళ్లు ముందు నిలిపింది. అయినవాళ్లని దూరం చేసి కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసింది. కొన్ని సందర్భాల్లో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాని కుటుంబాలు కనిపించాయి. ఈ తరహాలోనే జరిగిన ఘటనకు బెంగళూరులోని ఈఎస్‌ఐ ఆసుపత్రి సాక్ష్యంగా నిలిచింది. గతేడాది జులై నుంచి రెండు శవాలు అక్కడి మార్చురీలోనే మగ్గుతుండటం అందుకు నిదర్శనం. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
40 ఏళ్ల మహిళ, ఓ మధ్య వయస్కుడికి గత ఏడాది జూన్‌లో కరోనా సోకింది. దాంతో వారు చికిత్స నిమిత్తం రాజాజీ నగర్‌లోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూ కొద్దిరోజులకే ప్రాణాలు విడిచారు. నా అన్నవాళ్ల జాడ లేక.. అప్పటి నుంచి ఆ మృతదేహాలు అక్కడి మార్చురీలోనే ఉన్నాయి. ఏడాది గడిచినా మృతులకు అంత్యక్రియలు జరగపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.
దీనిపై రాజాజీ నగర్ భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ సురేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని, బాధ్యుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘కొవిడ్ మొదటి దశలో ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మృతి చెందారు. గతేడాది జులై నుంచి ఆ మృతదేహాలు ఈఎస్‌ఐ ఆసుపత్రిలోనే ఉన్నాయి. అవి ఇప్పుడు కుళ్లిన దశలో ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక ప్రభుత్వం, ఈఎస్‌ఐ అధికారులు వ్యవహరించి తీరు దారుణంగా ఉంది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో హృదయాల్ని మెలిపెట్టే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ ఘటన మాత్రం తీవ్ర దురదృష్టకరం. బాధ్యతారాహిత్యం, అమానవీయ ప్రవర్తనకు నిలువెత్తు నిదర్శనం’ అంటూ ఆ లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.