Aryan khan: బాంబే హైకోర్టులో ఆర్యన్‌ ఖాన్‌కి ఊరట

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ......

Published : 15 Dec 2021 15:53 IST

ముంబయి: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరుకావాలన్న బెయిల్‌ షరతు నుంచి ఉన్నత న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఇకపై ప్రతి శుక్రవారం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు దిల్లీలోని ఎన్సీబీ నేతృత్వంలోని సిట్‌కు బదిలీ కావడంతో ముంబయి ఎన్సీబీ కార్యాలయంలో హాజరుకావాలన్న షరతును సడలించాలంటూ ఇటీవల ఆర్యన్‌ ఖాన్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌డబ్ల్యూ సాంబ్రేతో కూడిన ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఆర్యన్‌కి బెయిల్‌ మంజూరు చేసినప్పుడు ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న షరతులో మార్పు చేసినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. దిల్లీ ఎన్సీబీ అధికారులు ఎప్పుడు సమన్లు పంపినా హాజరుకావాలని ఆర్యన్‌ ఖాన్‌కు సూచించారు.

అలాగే, అతడు హాజరయ్యేందుకు వీలుగా 72గంటల సమయం ఇవ్వాలని ఎన్‌సీబీకి సూచించారు. దీంతోపాటు ఆర్యన్‌ ముంబయి దాటి ఎక్కడికి వెళ్లినా ప్రయాణానికి సంబంధించిన వివరాలు అధికారులకు సమర్పించాలన్న నిబంధనలోనూ స్వల్ప మార్పులు చేశారు. దిల్లీలోని ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే, ముంబయి దాటి మరొక ప్రాంతానికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ షరతును సడలించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఎన్సీబీ తరఫు న్యాయవాది శ్రీరాం సిర్షాత్‌ కోర్టుకు తెలిపారు. అయితే, విచారణకు ఎప్పుడు పిలిచినా దిల్లీలో గానీ, ముంబయిలో గానీ ఆర్యన్‌ హాజరుకావాలన్నారు. దీనిపై ఆర్యన్‌ తరఫు న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ స్పందిస్తూ.. ఎప్పుడు విచారణకు పిలిచినా ఆర్యన్‌ హాజరవుతారని తెలిపారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని