Varavara Rao: వరవరరావుకు మరోసారి ఊరట.. బెయిల్‌ పొడిగింపు

భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుకు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అనారోగ్య కారణాల వల్ల వరవరరావు (82) బెయిల్‌ను పొడిగిస్తూ......

Published : 20 Dec 2021 23:23 IST

ముంబయి: భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుకు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అనారోగ్య కారణాల వల్ల వరవరరావు (82) బెయిల్‌ను పొడిగిస్తూ వస్తున్న బాంబే హైకోర్టు.. ఆయన విజ్ఞప్తి మేరకు తాజాగా మరోసారి పొడిగించింది. కొద్ది నెలల నుంచి మెడికల్‌ బెయిల్‌పై ఉన్న వరవరరావు ప్రస్తుతం భార్యతో ముంబయిలో ఉన్నారు. స్వరాష్ట్రం తెలంగాణ వెళ్లేందుకు అనుమతిని కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ వరకు బెయిల్‌ను పొడిగిస్తూ జస్టిస్ నితిన్ జామ్​దార్, జస్టిస్​ ఎస్​వీ కొత్వాల్​తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ బెయిల్‌ విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) కోర్టులో తన వాదనలు వినిపించింది. వరవరరావును జైలుకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. వైద్యచికిత్స అవసరం ఉన్న అనేక మంది వృద్ధులు జైల్లో ఉన్నారని ఎన్​ఐఏ తెలిపింది. ‘వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నారని నానావతి ఆస్పత్రి నివేదిక తెలిపింది. 80 ఏళ్లకు పైబడినవారిలో వయసుపరమైన సమస్యలుంటాయి. అలాగని ఆయనకు బెయిల్‌ పొడిగిస్తూ వెళ్లకూడదు. వైద్య చికిత్స అవసరమున్న చాలా మంది వృద్ధులు జైల్లో ఉన్నారు. ఆయన సరెండర్ అయ్యేందుకు ఆదేశాలు ఇవ్వండి’ అని ఎన్​ఐఏ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ అనిల్​ సింగ్ కోర్టును కోరారు.

ఇదిలా ఉంటే.. నానావతి ఆస్పత్రి నివేదికను కోర్టుకు ఎన్ఐఏ సమర్పించినా కూడా ఆయన జైలుకు వచ్చే స్థితిలో ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని వరవరరావు తరఫున వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ ఆనంద్ గ్రోవర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. డిసెంబరు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని గ్రోవర్​ను ఆదేశించింది. తదుపరి విచారణను 2022 జనవరి 4కు వాయిదా వేసింది.

ఇదీ కేసు..

మహారాష్ట్రలోని పుణె జిల్లా భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న అల్లర్లు చెలరేగాయి. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్‌ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గర్‌ పరిషత్‌ నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరకి హింసకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. వీటితో పాటు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావుతో సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం 2020లో ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి కొద్దిరోజుల క్రితమే కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని