Covid Protection: బూస్టర్‌ డోసు అవసరం తప్పదా..?

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా.. వాటినుంచి కలిగే రక్షణ కొన్ని నెలలకే క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Published : 07 Oct 2021 14:43 IST

ఇజ్రాయెల్‌, కతర్‌ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో వాటివల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే అంశంపైనా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా.. వాటినుంచి కలిగే రక్షణ కొన్ని నెలలకే క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మహిళల కంటే పురుషుల్లో తక్కువ రక్షణ ఉంటున్నట్లు పేర్కొన్నాయి. అందుకే బూస్టర్‌ డోసులు అవసరమని పలు దేశాలు చేస్తోన్న వాదనకు తాజా అధ్యయనాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

వ్యాక్సిన్‌ పంపిణీలో అన్ని దేశాలకంటే ఇజ్రాయెల్‌ ముందున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీకాల వాస్తవ ఫలితాలపై నిపుణులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌లో 5వేల మంది ఆరోగ్య కార్యకర్తలపై తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వారిలో కరోనా నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు క్రమంగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు. తొలుత అవి విస్తృత వేగంతో క్షీణించి అనంతరం తగ్గిపోతున్నట్లు కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది.

పురుషుల్లోనే తక్కువ రక్షణ..?

ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కొవిడ్ యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నాయి. ఇక చిన్న వయసువారితో పోల్చి చూసినప్పుడు వృద్ధుల్లో వేగంగా తగ్గిపోతున్నాయి. వ్యాక్సిన్‌ వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు.. కనిష్ఠ స్థాయికి తగ్గిపోయినపుడు పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషుల్లోనే వీటి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. అంతేకాకుండా రెండు డోసులు తీసుకున్నా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ఎందుకు వస్తున్నాయనే అంశాలను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన గిలి రెగెవ్‌-యోచయ్‌ పేర్కొన్నారు. అందుకే మూడో డోసు మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌ మాదిరిగానే అమెరికా వంటి దేశాలు కూడా బూస్టర్‌ డోసు ఇచ్చే ప్రణాళికను అమలు చేయనున్నట్లు  అంచనా వేశారు. అమెరికాలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ల కేసులు పెరగకుంటే అది నిజంగా ఆశ్చర్యపోయేవాడిని అని రెగెవ్‌ యోచయ్‌ అభిప్రాయపడ్డారు.

కతర్‌ అధ్యయనంలోనూ..

ఫైజర్‌ వ్యాక్సిన్‌లు ఇచ్చే రక్షణ విషయంపై వాస్తవ ఫలితాల కోసం ఈ మధ్యే కతర్‌లో జరిపిన అధ్యయనంలోనూ ఇటువంటి ఫలితాలే వచ్చాయి. రెండో డోసు తీసుకున్న తొలి నెలలో ఇవి 77.5శాతం రక్షణ కల్పించగా.. ఐదు నుంచి ఏడు నెలల్లోనే 20శాతానికి పడిపోయినట్లు వెల్లడైంది. న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కూడా బూస్టర్‌ డోసుల అవసరాన్ని బలపరిచింది.

అయినప్పటికీ టీకాల వల్ల రక్షణే..

వ్యాక్సిన్‌ల వల్ల కలిగే యాంటీబాడీలు క్షీణిస్తున్నప్పటికీ తీవ్ర అనారోగ్యం బారినపడకుండా వ్యాక్సిన్‌లు పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న తొలి రెండు నెలలు 96శాతం రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. ఇన్‌ఫెక్షన్‌ బారినపడడం కంటే కొవిడ్‌ బారినపడి అనంతరం ఆస్పత్రుల్లో చేరడం, మరణాల నుంచి బలమైన రక్షణ కలిగిస్తున్నాయని కతర్‌లోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు లయిత్‌ అబు-ర్యాడిడ్‌ స్పష్టం చేశారు. బూస్టర్‌ డోసు ఇవ్వడంతో ఈ రక్షణ మరింత పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, కరోనా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్న (Breakthrough Infection) కేసులు పెరుగుతుండడంతో ఇజ్రాయెల్‌ ఇప్పటికే బూస్టర్‌ డోసు పంపిణీ మొదలు పెట్టింది. అటు అమెరికా కూడా వృద్ధులు, వ్యాధినిరోధకత తక్కువగా ఉండే వారికి బూస్టర్‌ డోసు అందించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు యూరప్‌ దేశాలు కూడా మూడో డోసు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. వ్యాక్సిన్‌ల నుంచి పొందే రక్షణ తగ్గుతుందని నివేదిక వెల్లడించడం, కొత్త వేరియంట్లకు కళ్లెం వేయడం కోసం ఈ బూస్టర్‌ డోసులు అవసరమని భావిస్తున్నట్లు ఆయా దేశాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని