
Rolls Royce: బ్రిటన్‌లో ఆ కుబేరుడి అభిరుచే వేరు!
తలపాగాకు తగ్గ రంగుల్లో రోల్స్ రాయిస్ కార్లు
లండన్: రోల్స్ రాయిస్.. ప్రపంచంలోని చాలా కుటుంబాల సగటు ఆస్తి కన్నా ఖరీదైనది. ఇలాంటి కారు ఒక్కటైనా కొనాలని సంపన్నులు సైతం తహతహలాడిపోతారు. అలాంటిది ఓ భారత సంతతి వ్యక్తి మాత్రం తన తలపాగాకు నప్పే రంగుల్లో ఈ కార్లు కొంటున్నారు. ఆయన పేరు రూబెన్ సింగ్. బ్రిటన్‌లో నివసించే భారత సంతతి కుబేరుడు. తన విలాసాల గురించి సామాజిక మాధ్యమాల్లో ఆయన తరచూ పోస్ట్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షా 18 వేల మంది ఫాలోవర్లు ఆయనకు ఉన్నారు. మూడు రంగుల్లో ఈ మధ్య కొన్న ఆరు రోల్స్ రాయిస్ కార్ల కోసం రూ.17.05 కోట్లు వెచ్చించారు. ఆయన గ్యారేజ్‌లో రోల్స్ రాయిస్ కార్లు 15 ఉన్నాయి. ఇతర లగ్జరీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! కొద్దిరోజుల క్రితం ‘తలపాగా సవాల్’ను రూబెన్ సింగ్ చేపట్టారు. ప్రతిరోజూ తలపాగా రంగుకు సరిపోలే రోల్స్ రాయిస్ కార్లలో ప్రయాణించడమే దీని ఉద్దేశం. ‘మనవల్ల ఎవరికీ ఇబ్బందులు కలగనప్పుడు, ఎవరినీ మోసం చేయనప్పుడు.. మనకు నచ్చింది చేయడమే మంచిది. దీనిపై ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని రూబెన్ అంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.