
Bulli Bai case: ‘మహిళల వేలం’ యాప్ కేసులో ప్రధాన నిందితురాలి అరెస్ట్!
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బుల్లీ బాయ్’ కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేశారు. తొలుత 21ఏళ్ల విశాల్ అనే విద్యార్థిని బెంగళూరులో అరెస్ట్ చేసిన ముంబయి సైబర్ పోలీసులు.. అతడిని విచారించగా పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఉత్తరాఖండ్‌లో ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణ కోసం పోలీసులు ఆమెను మంబయికి తీసుకురానున్నారు. సోమవారం బెంగళూరు ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అనేక గంటలపాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి ముంబయికి తీసుకొచ్చారు. మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొందరు ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టి అల్లరిపాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ‘బుల్లీ బాయ్’ పేరిట యాప్‌ను సృష్టించి వికృత పనులకు పాల్పడుతుండటంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. వందలాది మంది మహిళల చిత్రాలు యాప్‌లో ఉన్నట్లు సమాచారం. తన ఫొటోను కూడా దుండగులు యాప్‌లో అప్లోడ్ చేసినట్లు ఓ మహిళా జర్నలిస్టు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి దీనిపై స్పందిస్తూ.. బుల్లీ బాయ్ యాప్, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించేపనిలో పడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.