Door-to-Door Vaccine: విశాల దేశంలో.. ఇంటివద్దే టీకాలు అసాధ్యమే!

దేశంలో నెలకొన్న భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఇంటివద్దే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించడం ఆచరణ యోగ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

Published : 08 Sep 2021 23:12 IST

ప్రస్తుత విధానాన్ని రద్దు చేయలేమన్న సుప్రీం ధర్మాసనం

దిల్లీ: దేశంలో నెలకొన్న భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఇంటివద్దే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించడం ఆచరణ యోగ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందులో భాగంగా టీకా పంపిణీలో ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. వికలాంగులతో పాటు బలహీన వర్గాల వారికి ఇంటివద్దే (డోర్‌-టు-డోర్‌) వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

‘లద్దాఖ్‌లో ఉన్న పరిస్థితి కేరళలో లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పట్టణ, నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇలా విశాల దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన సమస్యలు ఉన్నాయి.’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగానే కొనసాగుతోంని.. ఇప్పటికే దాదాపు 60శాతానికిపైగా ప్రజలకు తొలిడోసు అందించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలని అభిప్రాయపడిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రస్తుతం టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వికలాంగులతోపాటు ఇతర వర్గాల వారికి ఇంటివద్దే వ్యాక్సిన్‌ అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘యూత్‌ బార్‌ అసోసియేషన్‌’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈవిధంగా స్పందించింది. అయితే, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు సుమోటోగా పర్యవేక్షిస్తున్నామన్న సుప్రీం ధర్మాసనం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అర్థం చేసుకోగలమని అభిప్రాయపడింది.

మరణాలన్నీ నిర్లక్ష్యం వల్లే అని భావించలేం..

దేశంలో కొవిడ్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ విజృంభణ సమయంలో సంభవించిన మరణాలు.. నిర్లక్ష్యం వల్లే అని భావించడం సరికాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా అవి వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగాయని ఊహించుకోలేమని స్పష్టం చేసింది. సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ మరణాల నిర్లక్ష్యం వల్లే జరిగాయని పేర్కొంటూ.. బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, కొవిడ్‌ వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు వారికి పరిహారం ఇచ్చే విషయమై ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థకు ఆదేశాలు జారీ చేశామని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. అలాంటి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూపొందించే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని