Chhattisgarh: అనుచిత వ్యాఖ్యలు.. సీఎం తండ్రిపై కేసు నమోదు!

ఓ వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రిపై కేసు నమోదయ్యింది.

Published : 05 Sep 2021 19:08 IST

వివాదాస్పదమైన ఛత్తీస్‌గఢ్‌ సీఎం తండ్రి వ్యాఖ్యలు

రాయ్‌పూర్‌: ఓ వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రిపై కేసు నమోదయ్యింది. కులాల మధ్య విరోధం పెంచడంతో పాటు ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై రాయ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం బఘేల్‌.. చట్టానికి ఎవరూ అతీతం కాదని స్పష్టం చేశారు.

ఓ వర్గం వారిని విదేశీయులుగా పేర్కొన్న ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ బఘేల్‌ (75), వారిని గ్రామాల్లోకి రానివ్వవద్దంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా వారిని గ్రామాల నుంచి నిషేధించేందుకు ఇతర వర్గాల వారితో మాట్లాడుతాను అంటూ పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. సీఎం తండ్రి వ్యాఖ్యలు కులాల మధ్య విరోధం పెంచడంతో పాటు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ‘సర్వ్‌ బ్రాహ్మిణ్‌ సమాజ్‌’కు చెందిన ప్రతినిధులు రాయ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 153-A, 505-A కింద సీఎం తండ్రి నంద కుమార్‌ బఘేల్‌పై దీన్‌దయాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఓ వర్గాన్ని కించపరుస్తూ తండ్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్ స్పందించారు. ఓ కుమారుడిగా తన తండ్రిని గౌరవిస్తానని.. అదే సమయంలో మతసామరస్యం దెబ్బతినేలా ఎవరు వ్యాఖ్యలు చేసిన క్షమించేది లేదని అన్నారు. ఓ వర్గంపై తన తండ్రి చేసిన వ్యాఖ్యలు కూడా నన్ను బాధించాయని.. అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతం కాదన్నారు. చట్టమే అత్యున్నతమైందని.. తమ ప్రభుత్వం ఇందుకు కట్టుబడి ఉంటుందని భూపేశ్‌ బఘేల్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని