CBSE: వచ్చేవారం సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు...

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలపై కసరత్తును ముమ్మరం చేసినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అధికారి సన్యం భరద్వాజ్‌ తెలిపారు

Updated : 31 Jul 2021 10:40 IST

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలపై కసరత్తును ముమ్మరం చేసినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అధికారి సన్యం భరద్వాజ్‌ తెలిపారు. వచ్చే వారంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సన్యం భరద్వాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాలను వచ్చేవారంలో విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

ఈ సందర్భంగా సీబీఎస్‌ఈలో ‘సెమిస్టర్‌’ విధానంపైనా ఆయన స్పందించారు. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించేలా ఓ స్కీమ్‌ను రూపొందించినట్లు తెలిపారు. దానివల్ల భవిష్యతుల్లో ఇలాంటి మహమ్మారి తరహా పరిస్థితులు ఎదురైతే పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి పెద్దగా సమస్యలు ఎదురవవని ఆయన అభిప్రాయపడ్డారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) ఇటీవల ప్రత్యేక మదింపు విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అకాడమిక్‌ సెషన్‌ను రెండు భాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని