Published : 07/12/2021 02:14 IST

Omicron: ఒక్కడోసూ తీసుకోనివారికే ముప్పు: సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌

అదే బాటలో రోగపీడిత వయోధికులు 

ఒమిక్రాన్‌పై ఊహాగానాలొద్దు.. నమూనాలు పరీక్షిస్తున్నాం 

ఇప్పటికీ అధికంగా వ్యాప్తిలో ఉన్నది డెల్టా రకమే 

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌లో కొత్త రకం ఒమిక్రాన్‌ గురించి ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం(రియల్‌ టైమ్‌ డాటా) అందుబాటులోకి రావాల్సి ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి స్పష్టీకరించారు. హైదరాబాద్‌ వస్తున్న విదేశీ ప్రయాణికుల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలు తమ ల్యాబ్‌కు చేరుతున్నాయని ఆయన తెలిపారు. వీటి జన్యుక్రమాలను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ఉన్నట్లు వివరించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై భయాందోళనలు రేగుతున్న నేపథ్యంలో ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి. 

సీసీఎంబీకి వస్తున్న నమూనాల వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో ఏం గుర్తించారు..?

అత్యవసర పరిస్థితుల దృష్ట్యా చిన్న యంత్రం నానోపై వాటి జన్యుక్రమాలను కనుగొంటున్నాం. ఇందుకు 48గంటల సమయం పడుతుంది. ఫలితం రాగానే వెల్లడిస్తాం. నమూనాలు పెరిగేకొద్దీ పెద్ద యంత్రంపై జన్యుక్రమాలను కనుగొనే ప్రక్రియ చేపడతాం.   

కొత్త వేరియంట్‌ ముప్పు ఎవరికి ఎక్కువ..?

ఒమిక్రాన్‌ అయినా మరోటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు ఉంటుంది. పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారికీ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొవిడ్‌ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువ.  

రెండు డోసులు తీసుకున్నవారూ కొవిడ్‌ బారిన పడుతున్నారెందుకు..?

టీకా తీసుకుంటే అసలు కొవిడ్‌ బారిన పడరని అనలేం. లక్షణాలు పెద్దగా ఉండవంతే. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. రెండు డోసులూ తీసుకున్నాక కూడా కొవిడ్‌ బారిన పడుతున్నట్లయితే దానిపై శాస్త్రీయ అధ్యయనం జరగాల్సి ఉంది.  

ఒమిక్రాన్‌తో మహమ్మారి దశ ముగియనుందా?

ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఇప్పటివరకు ఎక్కువ మంది యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువకుల్లో వైరస్‌ లక్షణాలు తక్కువే ఉంటాయి. అలాగని ఒమిక్రాన్‌తో పెద్దగా ముప్పులేదని అప్పుడే నిర్ధారణకు రాలేం. లక్షణాలు తక్కువనీ  చెప్పలేం. అధ్యయనం జరగాల్సి ఉంది.  

కేసులు పెరుగుతున్నాయి.. మూడో వేవ్‌ ముప్పు మొదలైందనుకోవచ్చా..?

అలా ఊహించి చెప్పలేం. జనాభాలో ఇప్పటికే టీకాలు వేయించుకున్నవారు, కొవిడ్‌ బారిన పడినవారు కలిపి 70 శాతం ఉంటే.. మిగతా 30 శాతం జనాభాకు సోకే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక కూడా కొందరిలో పాజిటివ్‌ రావొచ్చు. అంతా జాగ్రత్తలు పాటించాల్సిందే. రెండు డోసులూ వేయించుకోవాల్సిందే. 


వ్యాప్తిలో ఏరకం వైరస్‌ ఉంది?

నవంబరు 15 వరకు వచ్చిన నమూనాల్లో 80 నుంచి 90 శాతం వరకు డెల్టా, అందులోని ఉపరకాలే కనిపించాయి. మిగిలిన వాటి ఫలితాలు రావాల్సి ఉంది. కొత్త రకం వైరస్‌లో స్పైక్‌ ప్రొటీన్‌లో 32 ఉత్పరివర్తనాల కారణంగా అది రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవిక సమాచారం ఆధారంగా అధ్యయనం చేస్తే తప్ప అది ప్రమాదకారినా.. కాదా.. అనేది చెప్పలేం. వీటిపై ఊహాగానాలు తగదు. 


అధిక రక్షణకు బూస్టర్‌ డోసు అవసరమా?

మనదేశ జనాభా సుమారు 130 కోట్లు. ఇంకా అందరికి వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదు. రెండో డోసు చాలామంది వేయించుకోవాల్సి ఉంది. ఇది మన మొదటి ప్రాధాన్యం. తర్వాత 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వాల్సి ఉంది. బూస్టర్‌ డోసుపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే మనవి భిన్న పరిస్థితులు. 


 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని