Social Media: సోషల్‌ మీడియా బ్లాక్‌ చేయడంపై కేంద్రం ఏమందంటే..!

దేశంలో ఏదైనా సామాజిక మాధ్యమం వేదికను నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 05 Aug 2021 21:23 IST

దిల్లీ: దేశంలో సామాజిక మాధ్యమ వేదికలను నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. యూజర్ల భద్రతతోపాటు పారదర్శకతపై సోషల్‌ మీడియా కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. విద్వేష భావాన్ని పెంచేందుకు కొందరు యూజర్లు ఇలాంటి మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని.. అయినప్పటికీ ఏ సామాజిక మాధ్యమంకానీ, ఇతరులు ఎవరైనా దేశ ప్రజాస్వామ్యాన్ని నష్టపరచలేవని స్పష్టం చేసింది.

సామాజిక మాధ్యమ వేదికలపై ద్వేషపూరిత కంటెంట్‌ గురించి యూజర్ల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వాటికి తగిన విధంగా సమాధానం ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐటీ యాక్ట్‌ 2000, సెక్షన్‌ 69A ప్రకారం, ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్‌ను ప్రభుత్వం బ్లాక్‌ చేస్తుందని చెప్పారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, రక్షణతో పాటు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇతర దేశాలతోనూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఏదైనా సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్‌ చేసే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని