Published : 03 Dec 2021 18:45 IST

Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే..?

టీకానే ఆయుధం - కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశంలో వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నప్పటికీ భారత్‌లో మాత్రం దీని తీవ్రత తక్కువగానే ఉండవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముఖ్యంగా దేశంలో అర్హులైన వారిలో మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్‌ అందడంతోపాటు ఇప్పటికే ఎంతోమంది డెల్టా వేరియంట్‌కు గురైన కారణంగా ఈ వేరియంట్‌ ప్రభావం స్వల్పంగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదైన నేపథ్యంలో వీటికి సంబంధించి తరచుగా అడుగు ప్రశ్నలకు (FAQs) కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానాలు ఇచ్చింది.

తీవ్రత తక్కువే..

ఓవైపు ముమ్మరంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌, మరోవైపు మెజారిటీ ప్రజలు డెల్టా వేరియంట్‌కు గురైనట్లు సీరో పాజిటివిటీ సర్వేల ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం కొత్త వేరియంట్‌ ప్రభావం భారత్‌లో తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా జులై నాటికే దాదాపు 70శాతం మందికి డెల్టా ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వచ్చిన సర్వేల నివేదికలను గుర్తుచేసింది. అయినప్పటికీ దీనిపై శాస్త్రీయ ఆధారాల కోసం వేచిచూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కేసుల సంఖ్య పెరగొచ్చు..

కొత్తగా వెలుగు చూసిన వేరియంట్‌ దేశంలో థర్డ్‌వేవ్‌కు కారణమవుతుందా అన్న ప్రశ్నపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. భారత్‌తోపాటు ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాపించనుందని పేర్కొంది. అంతేకాకుండా మరికొన్ని రోజులు, వారాల్లోనే భారత్‌లో వీటి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ మనదేశంలో దీని తీవ్రత మాత్రం తక్కువగా ఉండవచ్చనే అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త వేరియంట్‌ గుర్తించిన ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయన్న ప్రభుత్వం.. వైరస్‌ ప్రాబల్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇప్పటివరకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తికి ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వ్యాక్సిన్‌.. వ్యాక్సిన్‌.. వ్యాక్సిన్‌..

ఒమిక్రాన్‌ వేరియంట్‌లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు వ్యాక్సిన్‌ సమర్థతను తగ్గిస్తాయని వస్తోన్న ఊహాగానాలపైనా కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ఈ వేరియంట్‌పై ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వ్యాధి తిరగబడడం, రోగనిరోధకతశక్తి నుంచి కొత్త వేరియంట్‌ తప్పించుకునే సామర్థ్యంపై మరింత సమాచారం రావాల్సి ఉందని తెలిపింది. అయినప్పటికీ వ్యాక్సిన్‌లతోనే పూర్తి రక్షణ పొందవచ్చన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించింది. వీటికితోడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని