ZyCov D: జైడస్‌ క్యాడిలా.. కోటి డోసులకు కేంద్రం ఆర్డర్‌!

జైడస్‌ క్యాడిలా రూపొందించిన కరోనా టీకా జైకోవ్‌-డీ (ZyCov D) కోటి డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది.

Published : 08 Nov 2021 01:12 IST

త్వరలోనే చిన్నారులకు అందుబాటులోకి రానున్న జైకోవ్‌ డీ

దిల్లీ: దేశంలో మరికొన్ని రోజుల్లోనే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం వ్యాక్సిన్‌ సేకరణ, పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జైడస్‌ క్యాడిలా రూపొందించిన కరోనా టీకా జైకోవ్‌-డీ (ZyCov D) కోటి డోసులను ఆర్డర్‌ చేసింది. అయితే, ఒక్కో డోసుకు దాదాపు రూ.358 చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ నెలలోనే జైడస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే ఈ టీకాను 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌-డీ టీకా ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ ఆధారిత కొవిడ్‌ టీకాగా నిలిచింది. అత్యవసర వినియోగానికి కూడా అనుమతి లభించిన నేపథ్యంలో డోసులు అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తొలుత కోటి డోసులను ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు జైడస్‌ క్యాడిలా కూడా నెలకు కోటి డోసులను అందుబాటులో ఉంచేందుకు వనరులను సమకూర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

సూది అవసరం లేకుండా ఇచ్చే ఈ టీకా పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా జెట్‌ అప్లికేటర్‌ అనే పరికరాన్ని వినియోగించనున్నారు. జెట్‌ అప్లికేటర్‌తో కలిపి టీకా ఒక డోసు ధర రూ.358కు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను ప్రతి 28 రోజుల గడువులో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని కూడా ప్రభుత్వం ఉచితంగానే రాష్ట్రాలకు అందించనుంది.  ఇక 2 నుంచి 18ఏళ్ల వయసు చిన్నారుల కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగ అనుమతికి కేంద్ర ఔషధ సంస్థ ఆధ్వర్యంలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ అక్టోబర్‌ 12న సిఫార్సు చేసింది. దీనిపై భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) నిర్ణయం కూడా త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని