PM Modi: ప్రతి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీ లక్ష్యంగా..!

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్‌ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 30 Sep 2021 15:32 IST

ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్న ప్రధాని మోదీ

దిల్లీ: దేశంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్‌ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్‌లో నాలుగు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.

‘కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ ఆరోగ్య రంగానికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌ కూడా సంక్షోభ సమయంలో ఆరోగ్య రంగంలో తన శక్తిని, స్వయం సమృద్ధిని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఈ నాలుగు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు అడుగులు పడ్డాయి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014 నుంచి కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 23 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. అందులో ఇప్పటికే ఏడు కాలేజీలు కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. 2001లో గుజరాత్‌ ఆరోగ్య రంగం ఎదుర్కొన్న సవాళ్లను మోదీ గుర్తు చేశారు.. అనంతరం పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు.

ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో 82వేల యూజీ & పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయని.. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య లక్షా 40వేలకు చేరిందని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతేకాకుండా 6 ఎయిమ్స్‌ల నుంచి 22 ఎయిమ్స్‌లకు పెంచే ప్రయత్నం చేశామన్నారు. గడిచిన 6-7 ఏళ్లలోనే కొత్తగా 170 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయని.. మరో వంద మెడికల్‌ కాలేజీలు అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పారు. ఇలా కనీసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ లేదా పీజీ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఆరోగ్య వ్యవస్థ భిన్న స్థాయిలో ఉందని.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్ద ఆసుపత్రుల వరకు అన్నింటినీ ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ ఆలోచనలో భాగంగానే స్వచ్ఛ భారత్‌, ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని