China Hits Back America: అమెరికాను ఇప్పుడెవరు నమ్ముతారు..?

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులపై చైనా మండిపడింది. ఇది అమెరికా స్వార్థపర విదేశీ విధానానికి నిదర్శనమని ఆరోపించింది.

Published : 24 Aug 2021 23:28 IST

అఫ్గాన్‌ వ్యవహారంలో అమెరికా తీరుపై మండిపడ్డ చైనా

బీజింగ్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులపై చైనా మండిపడింది. ఇది అమెరికా స్వార్థపర విదేశీ విధానానికి నిదర్శనమని ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో సమీప దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ చేసిన ఆరోపణలపై చైనా ఈ విధంగా స్పందించింది.

ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ సింగపూర్‌, వియత్నాంలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలో అధికభాగం తమదేనంటూ చైనా చేస్తోన్న ప్రయత్నాలను తిప్పికొట్టారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చైనా బెదిరింపు ధోరణికి పాల్పడుతోందంటూ విమర్శించారు. ఈ విషయంలో మిత్రదేశాలకు అండగా ఉండడంతో పాటు అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉంటామని కమలాహారిస్‌ పేర్కొన్నారు. 

అమెరికా ఉపాధ్యక్షురాలు చేసిన ఆరోపణలపై స్పందించిన చైనా.. అమెరికానే తన బెదిరింపు, ఆధిపత్య ప్రవర్తనను కాపాడుకోవడానికి తమపై ఇలాంటి ఆరోపణలకు దిగుతోందని దుయ్యబట్టింది. అమెరికా చెబుతోన్న అంతర్జాతీయ నియమాల మాట ఏమిటో ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు. ఒక దేశంలో సైనిక జోక్యాన్ని ఇష్టపడే అమెరికా.. ఆ దేశంలో ప్రజలు కష్టాలు పడుతుంటే బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాధాన్ని సమర్థించుకునేందుకు అమెరికా ఇతర దేశాలపై చేసే అణచివేతలు, బెదిరింపులు, వేధింపులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. అమెరికా కోరుకునేది ఇదే.. కానీ, ఇప్పుడు వారిని ఎవరు నమ్ముతారు..? అని చైనా ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అమెరికా ఉపాధ్యక్షురాలి ఆరోపణలను తిప్పికొట్టారు.

ఇదిలాఉంటే, రెండు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం సింగపూర్‌లో దిగిన కమలాహారిస్‌.. అక్కడ రెండు రోజుల పర్యటన పూర్తిచేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రితో కమలాహారిస్‌ భేటీ కావడంతో పాటు అమెరికా నావికా విభాగం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం మంగళవారం సాయంత్రం కమలాహారిస్‌ వియత్నాం చేరుకుంటారు. అయితే, ఆఫ్గాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ..ఆమె ఆసియా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని