
Arunachal Pradesh: డ్రాగన్ మళ్లీ విషం కక్కింది..
తిప్పికొట్టిన భారత్
దిల్లీ: భారత్-చైనా సరిహద్దు సమస్యపై ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు పలు దఫాల్లో చర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను తాము భారత్‌లో ప్రాంతంగా గుర్తించని కారణంగా భారత నాయకులు అక్కడ పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది.
‘సరిహద్దు సమస్యపై చైనా వైఖరి స్పష్టంగా ఉంది. భారత్ ఏకపక్షంగా ఏర్పాటు చేసుకున్న అరుణాచల్ ప్రదేశ్‌గా పిలువబడే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదు. అలాంటి ప్రాంతాన్ని భారత నాయకులు పర్యటించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’ అని చైనా విదేశాంగశాఖ మంత్రి ఝావో లిజియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనా చేస్తోన్న అభ్యంతరాలను భారత్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సరిహద్దు సమస్యను మరింత సంక్లిష్టం చేసే ఇలాంటి చర్యలను భారత్ మానుకోవాలని.. తద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను కాపాడే ప్రయత్నం చేయాలని ఝావో లిజియన్ ఊకదంపుడు ఉపన్యాసమిచ్చారు.
మండిపడ్డ భారత్..
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఆ ప్రాంతం దేశంలో సంపూర్ణ, విడదీయరాని భాగమని ఉద్ఘాటించింది. భారత నాయకులు అక్కడ పర్యటించకూడదని చైనా చెప్పడంలో ఎటువంటి అర్థం లేదని.. అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. దేశంలో ఇతర ప్రాంతాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్ ప్రదేశ్‌లోనూ భారత నాయకులు పర్యటిస్తారని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే, భారత్-చైనా మధ్య సరిహద్దు అంశంపై ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ మాత్రం దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది.ఈ ప్రాంతంలో భారత నాయకులు పర్యటించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమైన అక్కడి అసెంబ్లీలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తున్నాయనడానికి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోన్న పరివర్తనే సాక్ష్యాలని అన్నారు.