China: ‘ఆ భూభాగం మాదే’.. అరుణాచల్​ ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని సమర్థించుకున్న చైనా

అరుణాచల్ ​ప్రదేశ్​లో 15 ప్రాంతాలకు చైనీస్​ పేర్లు పెట్టడాన్ని చైనా సమర్థించుకుంది. ఈ విషయంపై భారత్​ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో శుక్రవారం వివరణ ఇచ్చింది.....

Published : 31 Dec 2021 19:03 IST

బీజింగ్‌: అరుణాచల్ ​ప్రదేశ్​లో 15 ప్రాంతాలకు చైనీస్​ పేర్లు పెట్టడాన్ని చైనా సమర్థించుకుంది. ఈ విషయంపై భారత్​ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో శుక్రవారం వివరణ ఇచ్చింది. దక్షిణ టిబెట్​లో అరుణాచల్ ప్రదేశ్ భాగమని.. తాము పేర్లు పెట్టడం తప్పేంకాదని వితండవాదం చేసింది.​ ఇవి తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలంటూ వక్రబుద్ధిని ప్రదర్శించింది.

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లోని 15 ప్రాంతాలకు చైనా.. అధికారిక చైనీస్​ పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై భారత్​ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ భారత్​లో అంతర్భాగమని, చైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టంచేసింది. కొత్తగా పేర్లు పెట్టడం ద్వారా ఈ వాస్తవాన్ని చైనా మార్చజాలదని తేల్చి చెప్పింది.

ఈ అంశంపై శుక్రవారం చైనా స్పందించింది. 15 ప్రాంతాలకు తాము పేర్లు పెట్టడాన్ని సమర్థించుకుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అక్కడి అధికార మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్​ దక్షిణ టిబెట్​లో భాగమని పేర్కొన్నారు. అరుణాచల్‌లో ఎన్నో సంప్రదాయ తెగలు చాలా ఏళ్లుగా జీవిస్తున్నాయి. మేం పేరుపెట్టిన ప్రాంతాలు చైనాలోని భూభాగాలే. స్వయంప్రతిపత్తి గల ప్రాంతానికి తాము పేర్లు పెట్టడంలో తప్పేముంది? నిబంధనలకు అనుగుణంగా చైనాలోని సంబంధిత ప్రాంతాలకు పేర్లు పెట్టాం. ఇవి చైనా సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలు’ అని వితండవాదం చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూభాగమని చైనా చాలా ఏళ్లుగా వాదిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని ‘జన్‌గ్నాన్‌’ అని చైనీస్‌ పేరుతో పిలుస్తోంది. ఆ రాష్ట్రంలో మరో 15 ప్రాంతాలకు చైనీస్‌, టిబెటన్‌, రోమన్‌ అక్షరాలతో కూడిన అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం ప్రచురించింది. అరుణాచల్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే ఆరు ప్రాంతాలకు తమ అధికారిక పేర్లను డ్రాగన్‌ పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు