China: జీరో కొవిడ్‌ వ్యూహంతో.. చైనా అగచాట్లు..!

పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించిన చైనా.. జీరో కొవిడ్‌ వ్యూహంతో నానా తంటాలు పడుతోంది.

Published : 31 Dec 2021 01:41 IST

వైరస్‌ కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడి

బీజింగ్‌: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌-19.. తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 2500 క్రియాశీల కేసులు ఉన్నట్లు చైనా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించిన చైనా.. జీరో కొవిడ్‌ వ్యూహంతో నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా వింటర్‌ ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ కొవిడ్‌ను కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతున్న వేళ.. అటు చైనాలోనూ వైరస్‌ ఉద్ధృతి మెల్లగా పెరుగుతోంది. చాలా నగరాల్లో నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజు 207 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చైనా నేషనల్‌ హెల్త్ కమిషన్‌ వెల్లడించింది. వీరిలో 156 కేసులు స్థానికంగా వ్యాప్తిచెందగా.. 51 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనని పేర్కొంది. ఇలా మొత్తంగా ప్రస్తుతం 2,563 బాధితులు చికిత్స తీసుకుంటుండగా.. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రకటించింది. వుహాన్‌లో తొలికేసు వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1,01,890 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 4,636 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

ఒమిక్రాన్‌పై లేని సమాచారం..

విశ్వవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో చైనా మాత్రం కట్టడి చర్యలను కఠినంగా అమలు చేస్తోంది. ఓవైపు సరిహద్దులను నియంత్రిస్తూనే అంతర్జాతీయ ప్రయాణాలను పరిమితం చేస్తోంది. ముఖ్యంగా ‘జీరో కొవిడ్‌’ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా.. ఒక్క కేసు బయటపడినా లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతోంది. వైరస్‌ సోకిన వారిని ట్రేసింగ్‌ చేయడంతోపాటు కేసుల సంఖ్యను సున్నాకు తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో డిసెంబర్‌ 13న తియాంజిన్‌ ప్రావిన్సులో తొలి ఒమిక్రాన్‌ నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. కానీ దేశవ్యాప్తంగా దాని వ్యాప్తిపై మాత్రం ఇప్పటికీ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

కొవిడ్‌-19 విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కట్టడి చర్యలు, వ్యాక్సిన్‌ పంపిణీ, వైరస్‌తో కలిసి జీవించే వ్యూహంతో ప్రపంచ దేశాలు ముందుకెళుతున్నాయి. కానీ చైనా మాత్రం కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే జీరో కొవిడ్‌ వ్యూహాన్నే నమ్ముకుంది. తాజాగా డెల్టాతోపాటు ఒమిక్రాన్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరగడంతో డ్రాగన్‌ దేశం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా అక్కడ కొత్త సంవత్సరం (ఫిబ్రవరి 1), వింటర్‌ ఒలింపిక్స్‌ (Winter Olympics) సమీపిస్తుండడంతో వైరస్‌ను కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొవిడ్‌-19కు కారణమైన కరోనా వైరస్‌ వెలుగు చూసి డిసెంబర్‌ 31కి రెండేళ్లు పూర్తయ్యింది. అయినప్పటికీ వీటికి సంబంధించిన మూలాలు మిస్టరీగా మిగిలిపోయాయి. తొలిసారి వైరస్‌ బయటపడిన వుహాన్‌లోనూ కొవిడ్‌ కేసులు నమోదవుతూనే ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని