
China: ఈ డబ్బులు తీసుకోండి.. కరోనా మూలం ఎక్కడో చెప్పండి..!
తాజా ఉద్ధృతిపై చైనా నగరం ప్రకటన
బీజింగ్: చైనా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంది. మూడింట రెండొంతుల రాష్ట్రాల్లో వందల మంది వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్-జీరో వ్యూహంతో ముందుకెళ్తోన్న ఆ దేశానికి తాజా విజృంభణ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వుహాన్‌లో మహమ్మారి తొలిసారి వెలుగుచూసినప్పటి కంటే ఇప్పుడే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో చైనా వ్యాప్తంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరమయ్యాయి. ప్రభుత్వం ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. అయితే తాజా ఉద్ధృతికి అసలు మూలం ఎక్కడో చెప్పినవారికి చైనా నగరం ఒకటి భారీ నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
రష్యా సరిహద్దు కలిగిన హీహే నగర యంత్రాంగం తాజాగా కరోనా వ్యాప్తికి మూలం ఎక్కడుందో సమాచారం ఇచ్చిన వారికి లక్ష యువాన్లు (15,500 డాలర్లు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘తాజాగా వ్యాప్తికి అసలు మూలం ఎక్కడుందో సాధ్యమైనంత తర్వగా గుర్తించి, ఆ గొలుసును విచ్ఛిన్నం చేయాల్సి ఉంది’ అని పేర్కొంది. అలాగే రష్యాలో కరోనా రికార్డు స్థాయిలో విజృంభిస్తుండటంతో చైనా ప్రభుత్వం సరిహద్దు వెంబటి కఠిన చర్యలు తీసుకుంటోంది. స్మగ్లింగ్, అక్రమ వేట, సరిహద్దు వెంట చేపలు పట్టడం వంటి చట్టవిరుద్ధ చర్యలపై నమోదైన కేసుల వివరాలు వెంటనే ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసి దిగుమతి చేసుకున్న వస్తువుల్ని వెంటనే స్టెరిలైజ్ చేసి, పరీక్షలకు పంపించాలని వెల్లడించింది.
ఫిబ్రవరిలో చైనా వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వాటికి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంలో కేసుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. పలు నగరాలు లాక్డౌన్లో ఉన్నాయి. పలు చోట్ల విమానాలు రద్దయ్యాయి. పర్యాటక ప్రాంతాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పనిలేకుండా ఎవరు కూడా బయటకురావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. కాగా, తాజాగా స్థానికంగా 43 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 97,885 మందికి కరోనా సోకగా.. 4,636 మరణాలు సంభవించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.