
Omicron: ఒమిక్రాన్‌కు.. రోగనిరోధకత నుంచి తప్పించుకునే సామర్థ్యం ఎక్కువే!
జీనోమిక్స్ కన్సార్టియం ‘ఇన్సాకాగ్’ వెల్లడి
దిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఇప్పటికే 130కిపైగా దేశాలకు వ్యాపించింది. దీంతో విస్తృత వేగంతో వ్యాప్తి చెందడంతోపాటు రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశాలూ ఉన్నాయనే వార్తలతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగనిరోధకత నుంచి తప్పించుకునే సామర్థ్యం ఒమిక్రాన్‌కు ఎక్కువేనని చెప్పడానికి స్పష్టమైన ప్రయోగాత్మక, క్లినికల్ సమాచారం ఉందని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. అయినప్పటికీ ఇంతకుముందు చూసిన వేవ్‌లతో పోలిస్తే దీనివల్ల వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ నివేదికలను ప్రస్తావిస్తూ ‘ఇన్సాకాగ్’ తాజా బులిటెన్ విడుదల చేసింది.
‘ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర వేరియంట్‌గా డెల్టా ప్రాబల్యమే అధికంగా ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేసింది. యూకేలోనూ అధిక ప్రాబల్యమున్న వేరియంట్‌గా అవతరించనుంది. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఒమిక్రాన్‌కు అధికంగా ఉందని సమర్థించేందుకు స్పష్టమైన ప్రయోగాల, క్లినికల్ సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది’ అని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం పేర్కొంది. అదే సమయంలో ఇంతకుముందు చూసిన ప్రభావాలతో పోలిస్తే ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నట్లు పేర్కొంది. అయితే, ఇవి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలోనూ ఈవిధంగానే ఉంటాయా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదని తెలిపింది. అందుకే ఈ వేరియంట్ ముప్పు స్థాయి అధికంగానే పరిగణించబడుతుందని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. డెల్టాను అధిగమించడంలో ఈ పరిణామాలే కీలకంగా మారనున్నట్లు అభిప్రాయపడింది. దేశంలో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య చర్యలు తీసుకుంటూనే మరోవైపు వేరియంట్ తీవ్రతపై పరిశోధనలు జరుపుతున్నామని ఇన్సాకాగ్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 ప్రాబల్యం, తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా నిర్ధేశించిన ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు పంపించే కొవిడ్ పాజిటివ్ నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 781 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 241 మంది కోలుకున్నట్లు తెలిపింది.