Vaccination: గడువు ముగిసింది.. అయినా 11 కోట్లమంది రెండో డోసు తీసుకోలేదు..

దేశం ఇటీవలే 100 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసి, కీలక మైలురాయి దాటింది. ఈ సమయంలో మొదటి డోసు, రెండు డోసులు తీసుకున్న వారి మధ్య అంతరం భారీగా కనిపిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సుమారు 11 కోట్ల మంది గడువు ముగిసిపోయినప్పటికీ రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Published : 26 Oct 2021 19:06 IST

ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం

రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో రేపు దిల్లీలో సమావేశం

దిల్లీ: దేశం ఇటీవలే 100 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసి, కీలక మైలురాయి దాటింది. ఈ సమయంలో మొదటి డోసు, రెండు డోసులు తీసుకున్న వారి మధ్య అంతరం భారీగా కనిపిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సుమారు 11 కోట్ల మంది గడువు ముగిసిపోయినప్పటికీ రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న సమావేశానికి వారంతా హాజరుకానున్నారు. పెండింగ్‌లో ఉన్న రెండో డోసు, ఇప్పటివరకు మొదటి డోసు తీసుకోనివారికి టీకాలు అందించడంపై చర్చించనున్నారు. టీకా డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రెండో డోసు విషయంలో ప్రజలు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75 శాతం మంది మొదటి డోసు వేయించుకోగా.. 31 శాతం మంది మాత్రమే రెండో డోసు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. యూకేలో గుర్తించిన డెల్టా ఉపరకం( డెల్టా సబ్‌ వేరియంట్‌)పై నిపుణుల బృందం దృష్టిసారించిందని ఈ రోజు మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ‘ay.4.2 వేరియంట్‌పై నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ బృందాలు వివిధ రకాలైన వేరియంట్ల స్వభావాన్ని పరిశీలించనున్నారు’ అని మంత్రి వెల్లడించారు. అలాగే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగంపై ఈ రోజు జరిగే సమావేశం ఆధారంగా డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయం వెలువడనుందన్నారు. ‘డబ్ల్యూహెచ్‌ఓలో టెక్నికల్ కమిటీ కొవాగ్జిన్‌కు ఆమోదం తెలిపింది. ఈ రోజు ఇంకో కమిటీ దీనిపై చర్చిస్తోంది. దాని ఆధారంగా కొవాగ్జిన్‌కు ఆమోదం లభిస్తుంది’ అని మంత్రి వెల్లడించారు.  మరోపక్క త్వరలో మనదేశంలో చిన్నారులకు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో  జైకోవ్‌-డి ధర గురించి చర్చిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు