Coal Shortage: బొగ్గు సంక్షోభం.. క్యాప్టీవ్‌ మైన్స్‌ నుంచి బొగ్గు సరఫరా!

దేశంలో బొగ్గు సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బొగ్గు మంత్రిత్వశాఖ మరోసారి స్పష్టం చేసింది.

Published : 16 Oct 2021 02:22 IST

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నిర్ణయం

దిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బొగ్గు మంత్రిత్వశాఖ మరోసారి స్పష్టం చేసింది. ఇందుకోసం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అవసరమయ్యే బొగ్గు సరఫరాను పెంచేందుకు క్యాప్టీవ్‌ (సొంత అవసరాల కోసం కేటాయించిన) గనుల నుంచి బొగ్గును మళ్లిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

బొగ్గు లేదా ఖనిజాలు ఉత్పత్తి చేసే కంపెనీల అవసరాల కోసం ప్రత్యేకంగా క్యాప్టీవ్‌ మైన్స్‌ ఉన్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో క్యాప్టీవ్‌ మైన్స్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు తరలించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిలో ఒడిశాలోని ఎన్‌ఎల్‌సీ ఇండియాకు చెందిన తాలాబైరా 2, 3 గనుల నుంచి ఎన్‌టీపీసీకి బొగ్గు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు సంస్థల సమన్వయంతో తాలాబైరా ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు నుంచి దర్లిపాలి ఎన్‌టీపీసీకి బొగ్గు సరఫరాను ఇప్పటికే ప్రారంభించాయి.

ఎన్‌ఎల్‌సీ ఇండియా ఆధ్వర్యంలో నడిచే ఒడిశాలోని తాలాబైరా గనులకు ప్రతి ఏటా 2కోట్ల టన్నుల బొగ్గును సేకరించే సామర్థ్యం ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఈ మొత్తాన్ని సేకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా తీసుకున్న చర్యలతో కేవలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేయడమే కాకుండా మార్కెట్‌లోనూ బొగ్గు లభ్యత మరింత పెరుగుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎన్‌ఎల్‌సీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా కొన్ని బొగ్గు గనులు మూతపడడం, భారీ వర్షాల కారణంగా మరికొన్ని గనులను వరదలు ముంచెత్తడం వల్లే బొగ్గు సంక్షోభం ఏర్పడిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా నిత్యం 20లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. రుతుపవనాల ప్రభావం తగ్గుతున్నందున రానున్న రోజుల్లో బొగ్గు లభ్యత మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు