Corona in Kerala: దేశవ్యాప్తంగా తగ్గినా.. కేరళను వణికిస్తోన్న మహమ్మారి!

మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి.

Published : 28 Jul 2021 16:05 IST

దేశంలో రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళలోనే

తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేరళలో కొవిడ్‌ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒక్కరోజే 22వేల కేసులు..

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. దేశవ్యాప్తంగా వైరస్‌ విలయతాండవం చేసిన సమయంలోనూ కేరళ ప్రభుత్వం మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో కేరళ తీసుకుంటున్న వైరస్‌ కట్టడి చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా కొనియాడింది. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. వైరస్‌ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినప్పటికీ కేరళలో ఇంకా 10శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. అంతేకాకుండా గడిచిన 24గంటల్లో అత్యధికంగా 22వేల పాజిటివ్‌ కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.

వ్యాక్సినేషన్‌లో ముందున్నప్పటికీ..!

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వేగంగా అందిస్తోంది. అక్కడ 18ఏళ్ల వయసున్న జనాభాలో 21శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించింది. దేశ సరాసరి 9.9శాతం ఉండగా కేరళ అంతకుమించి పంపిణీ చేసింది. అయనప్పటికీ కరోనా కేసుల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ముఖ్యంగా ఐసీఎంఆర్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48శాతం కేరళ ప్రజలకు వైరస్‌ ముప్పు పొంచివుందనే అర్థమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అక్కడ ఎక్కువ కేసులు బయటపడుతున్నాయనే అనుమనం వ్యక్తం చేస్తున్నారు.

భారీ స్థాయిలో టెస్టులు..

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నప్పటికీ కేరళలో మాత్రం గడిచిన 6వారాలుగా 10 నుంచి 12శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15వేల మందిలో వైరస్‌ బయటపడుతోందని త్రివేండ్రం మెడికల్‌ కాలేజీ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు. అయితే, ఆస్పత్రిలో చేరికలు మాత్రం కాస్త తగ్గాయని చెప్పారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వైరస్‌ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోవడం వైరస్‌ తీవ్రతను తగ్గించడంలో ఎంతగానో దోహదం చేస్తుందని సూచించారు.

కట్టడికి ప్రయత్నిస్తున్నాం..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నమాట వాస్తవమేనని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ మధ్య కాలంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని.. మే 12న అత్యధికంగా 43వేల కేసులతో గరిష్ఠానికి చేరుకుందని చెప్పారు. అనంతరం తగ్గుతుందని భావించినప్పటికీ వైరస్‌ తీవ్రత ఇంకా కొనసాగుతోందని అన్నారు. అయితే ఈ పాజిటివిటీ గ్రాఫ్‌ను తగ్గించేందుకు కృషిచేస్తున్నామని వీణా జార్జ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వయసుపైబడిన, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండడం ప్రభుత్వానికి సవాలుగా మారిందన్నారు. అయినప్పటికీ వైరస్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని