Community Kitchens: ‘కమ్యూనిటీ కిచెన్‌’ పథకంపై కమిటీ ఏర్పాటు..!

దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలల ఏర్పాటుపై విధివిధానాలు రూపొందించేందుకు ఆయా రాష్ట్రాల పౌరసరఫరాలశాఖ కార్యదర్శులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తునట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

Published : 25 Nov 2021 22:20 IST

రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించిన కేంద్రం

దిల్లీ: దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలల ఏర్పాటుపై విధివిధానాలు రూపొందించేందుకు ఆయా రాష్ట్రాల పౌరసరఫరాలశాఖ కార్యదర్శులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తునట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. వివిధ రాష్ట్రాల ఆహార/పౌరసరఫరాల శాఖల మంత్రులతో దిల్లీలో జరిగిన సమావేశంలో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు, పీఎంజీకేఏవై అమలు తీరు, ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు కార్డు కార్యక్రమంతోపాటు పలు అంశాలు చర్చించామని తెలిపారు. ముఖ్యంగా దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని.. అందరికీ సరిపడా అహారం అందించే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పీయూష్‌ గోయల్‌ ఉద్ఘాటించారు.

‘నాణ్యత, పరిశుభత్ర, విశ్వసనీయత, సేవా స్ఫూర్తి అనే నాలుగు అంశాలు స్ఫురించేలా సామాజిక కిచెన్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది’ అని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోని పేదల పట్ల సానుభూతి ఉండడంతో పాటు చిన్నారులకు సరైన పోషకాహారాన్ని అందించేందుకు పారదర్శకమైన ఆహార కార్యక్రమాలను అందించడానికి సమిష్టి సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉందని రాష్ట్ర మంత్రులకు సూచించారు.

కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటును ప్రస్తావిస్తూ.. పేదలకు పట్టెడన్నం పెట్టడం సంక్షేమ రాజ్యానికి ఉన్న రాజ్యాంగబద్ధ బాధ్యత అని భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే పేర్కొంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలల (Community Kitchens) ఏర్పాటుపై ఏకరూప విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి మూడువారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని.. లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే చర్యలు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రులతో చర్చలు ప్రారంభించింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ కిచెన్‌ల అవసరం, విధివిధానాలను రూపొందించేందుకు పలు రాష్ట్రాల పౌరసరఫరాలశాఖ కార్యదర్శులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని