Covid Deaths: అవన్నీ అవాస్తవాలే..!

దేశంలో కరోనా మరణాల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉన్నాయని వస్తోన్న కథనాలు అవాస్తవాలని స్పష్టం చేసింది.

Published : 15 Jul 2021 01:32 IST

కొవిడ్‌ మరణాల నమోదుకు కచ్చితమైన వ్యవస్థ ఉందన్న కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: దేశంలో నమోదవుతున్న కొవిడ్‌ మరణాల కంటే వాస్తవ మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉన్నాయని వస్తోన్న కథనాలు అవాస్తవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన హెచ్‌ఎంఐఎస్‌ (HMIS)ను సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (CRS) తో పోల్చి చూస్తున్నారని.. ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే ఈ నివేదికలు రూపొందిస్తున్నారని తప్పుబట్టింది. ఇలాంటివి పూర్తిగా నిరాధారమైన, కల్పిత నివేదికలు అని స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ మునుపటి (కరోనా విజృంభణకు ముందు)తో పోలిస్తే మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. అయితే, ఈ మరణాలకు కచ్చితమైన కారణాలు లేని నేపథ్యంలో వాటిని కూడా కొవిడ్‌ మరణాలుగా పరిగణించాలనే వాదన మొదలైంది. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా వాటిని కొవిడ్‌ మరణాలకు ఆపాదించడం తప్పని పేర్కొంది. కొవిడ్ డేటా మేనేజిమెంట్‌లో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోందని.. కొవిడ్‌ మరణాల నమోదు ప్రక్రియకు కచ్చితమైన విధానాన్ని పాటిస్తున్నామని పునరుద్ఘాటించింది. ఈ ప్రత్యేక వ్యవస్థలో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసే బాధ్యతను కూడా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకే అప్పజెప్పినట్లు పేర్కొంది. అంతేకాకుండా కొవిడ్‌ మరణాల నమోదుపై డబ్ల్యూహెచ్‌ఓ కోడింగ్‌కు (ICD-10) అనుగుణంగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) మార్గదర్శకాలు జారీచేసిందని స్పష్టం చేసింది.

ఇక భారత్‌లో చోటుచేసుకుంటున్న కొవిడ్‌ మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారంటూ అంతర్జాతీయ స్థాయిలోనూ పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. కొవిడ్‌ మరణాలపై ప్రభుత్వం పారదర్శకంగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం, అవన్నీ నిరాధార, అవాస్తవ కథనాలు అని మరోసారి స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ .. మరణాల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో మరో 624 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌తో మృతిచెందిన వారిసంఖ్య 4లక్షల 11వేలు దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని