
Samyukta Kisan Morcha: ‘పెండింగ్‌లో ఉన్న డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే’
దిల్లీ: రైతుల సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లకు గాను కేంద్రం రూపొందించిన ముసాయిదాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. ఈ మేరకు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు గుర్నామ్ సింగ్ చారుని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అంశాలపై ఏకీభవిస్తున్నట్లు తెలిపిన ఆయన.. గురువారం సమావేశం అనంతరం ఆందోళన విరమించే విషయంపై నిర్ణయం తీసుకుంటామనిని స్పష్టం చేశారు. మరో రైతు నేత యుధ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలని, రైతులపై నకిలీ కేసుల ఉపసంహరణకు విధించిన షరతులు సహా.. ప్రభుత్వ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఆందోళన చేపడుతున్న రైతుల డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం.. నవంబర్ 29న పార్లమెంటులో అందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. అయితే.. ఎంఎస్పీపై చట్టబద్ధమైన హామీ, రైతులపై కేసుల ఉపసంహరణ, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం వంటి ఇతర డిమాండ్లను సైతం నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నందున ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ డిమాండ్ల సాధన కోసం కేంద్రంతో చర్చల కోసం ఎస్కేఎం ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్రంతో చర్చల్లో లఖింపుర్ ఖేరీ అంశం కూడా తమ ఎజెండాలో ఉంటుందని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.