Updated : 03 Dec 2021 18:30 IST

INSACOG: ఆ వయసు వారికి బూస్టర్‌ డోసు ఇవ్వొచ్చు..!

జీనోమిక్స్‌ శాస్త్రవేత్తల బృందం సిఫార్సు

దిల్లీ: వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను మరోసారి కలవరపెడుతోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయో అనే అంశంపైనా అధ్యయనాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముందస్తుగా పలు దేశాలు బూస్టర్‌ డోసు (Booster Dose) పంపిణీ మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ 40ఏళ్ల వయసు పైబడినవారికి బూస్టర్‌ డోసును ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని జీనోమ్‌ శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ఇందుకు సంబంధించి ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (INSACOG) విడుదల చేసిన వారాంతపు నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

‘ప్రస్తుత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు ఒమిక్రాన్‌ (Omicron) వేరియంట్‌ను తటస్థీకరించేందుకు సరిపోయేలా కనిపించడం లేదు. అయినప్పటికీ తీవ్ర వ్యాధి బారినపడే అవకాశాలు మాత్రం తక్కువే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకోని వారికి తక్షణమే అందించడంతో పాటు అధిక ముప్పు/వ్యాప్తికి ఆస్కారమున్న 40ఏళ్లు, ఆపై వయసు వారికి బూస్టర్‌ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు’ అని జీనోమిక్స్‌ కన్సార్టియం తాజా బులిటెన్‌లో సిఫార్సు చేసింది. వీటితోపాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇప్పటికే గుర్తించిన దేశాల నుంచి కొనసాగే రాకపోకలపైనా పర్యవేక్షణ ముమ్మరం చేయాలని ఇన్సాకోగ్‌ సూచించింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌ ఉనికిని సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు జన్యుపరమైన నిఘా ఎంతో కీలకమన్న ఇన్సాకోగ్‌.. ప్రజారోగ్య చర్యలు తీసుకోవడానికి ఇవి దోహదపడుతాయని తెలిపింది. దేశంలో బూస్టర్‌ డోసు ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయాన్ని తెలియపరచాలంటూ లోక్‌సభలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో తాజా సిఫార్సు ప్రాధాన్యత సంతరించుకుంది.

బూస్టర్‌ డోసుపై కసరత్తు ముమ్మరం..

కొత్త వేరియంట్‌ ఆందోళనలు ఎక్కువైన వేళ కేరళ, రాజస్థాన్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు బూస్టర్‌ డోసుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు దేశంలో సెకండ్‌ వేవ్‌ వంటి పరిస్థితులు తలెత్తకుండా చూడడంలో భాగంగా బూస్టర్‌ డోస్‌ వినియోగంపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈమధ్యే దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు కొవిషీల్డ్‌ను (Covishield) బూస్టర్‌ డోసుగా గుర్తించాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. ఇలా మూడో డోసుపై దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో అసలు బూస్టర్‌ డోసు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI), నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌లు (NEGVAC) బూస్టర్‌ డోసు ఇవ్వాల్సిన శాస్త్రీయ ఆధారాలు, అవసరంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో జీనోమిక్స్‌ కన్సార్టియం కూడా బూస్టర్‌ డోసుపై సిఫార్సు చేసింది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్