IAF Chopper Crash: కుప్పకూలే క్షణాల ముందు.. కెమెరాలో హెలికాప్టర్‌!

ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే జనరల్‌ బిపిన్‌రావత్‌ వెళుతున్నట్లు భావిస్తోన్న ఓ హెలికాప్టర్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోను చిత్రీకరించిన వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. ఆ మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు.

Published : 12 Dec 2021 22:26 IST

ఫోరెన్సిక్‌ విశ్లేషణకు ప్రత్యక్షసాక్షుల మొబైల్‌ ఫోన్‌

కున్నూర్‌: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించేందుకు వివిధ విభాగాలు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. ఇదే సమయంలో ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెళుతున్న హెలికాప్టర్‌ వీడియో బయటకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆ వీడియో ఇప్పటికే పోలీసులకు చేరింది. దీంతో దర్యాప్తు వేగవంతం చేసిన నీలగిరి పోలీసులు.. తాజాగా ఆ మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు.

కోయంబత్తూర్‌కు చెందిన వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే జో అనే వ్యక్తి నీలగిరి కొండల్లోని కట్టేరీ ప్రాంతానికి వెళ్లారు. ఆయనతో పాటు తన స్నేహితుడు నాజర్‌, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రైల్వే ట్రాక్‌పై వెళ్తూ వీడియో తీసుకుంటున్న సమయంలో అటు నుంచి వెళ్తున్న హెలికాప్టర్‌ను చూసిన జో.. ఉత్సాహంతో ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. తక్కువ ఎత్తులో నుంచి వెళ్తున్న హెలికాప్టర్‌ను చిత్రీకరిస్తుండగానే అది దట్టమైన పొగమంచులో కనిపించకుండా పోవడం స్పష్టంగా కనిపించింది. వెంటనే పెద్ద శబ్దం వారికి వినిపించింది. దాంతో ఏమైంది.. విరిగిపోయిందా..? అంటూ ఓ వ్యక్తి అంటుండగా మరోవ్యక్తి ‘అవును..’ అని చెబుతుండడం అందులో రికార్డయ్యింది. అనంతరం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

దీనిపై స్పందించిన జో.. ‘ఇదంతా కేవలం 4-5 సెకన్లలోనే జరిగిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. సమీపంలోని మా స్నేహితుడి ఇంటికి వెళ్లాం. ఆ తర్వాత హెలికాప్టర్‌ ప్రమాదంపై పూర్తి వివరాలు టీవీలో చూసి తెలుసుకున్నాం’ అని వివరించారు. వీడియో అందించేందుకు ముందుగా నీలగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లామని, అక్కడ అధికారులెవరూ లేరని తెలిపారు. అనంతరం ప్రమాదం జరిగిన చోటికే వెళ్లి స్థానిక ఇన్‌స్పెక్టర్‌కు ఈ వీడియో ఫుటేజ్‌ను అందించినట్లు చెప్పారు.

అయితే, దర్యాప్తులో ఈ వీడియో కూడా కీలకంగా మారడంతో నీలగిరి పోలీసులు దీనిపై దృష్టి సారించారు. తాజాగా ఆ ఫొటోగ్రాఫర్‌ (జో) మొబైల్‌ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని కోయంబత్తూర్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఘటన జరిగే సమయంలో నిషేధిత దట్టమైన అడవుల్లోకి వారు ఎందుకు వెళ్లారనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు హెలికాప్టర్‌ కుప్పకూలే సమయంలో ప్రత్యక్షసాక్షుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వీటికి తోడు దుర్ఘటన సమయంలో కున్నూర్‌ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులపై ఇప్పటికే చెన్నై వాతావరణశాఖ విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని