Omicron: చైనాలో తొలి ఒమిక్రాన్‌ కేసు.. డ్రాగన్‌లో కలవరం!

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఆందోళనకర ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా కొవిడ్‌-19 మహమ్మారి పుట్టిన చైనాలోనూ తొలి కేసు నమోదయ్యింది.

Updated : 13 Dec 2021 21:36 IST

బీజింగ్‌: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆందోళనకర ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా కొవిడ్‌-19 మహమ్మారి పుట్టిన చైనాలోనూ తొలి కేసు నమోదయ్యింది. టియాంజిన్‌ నగరంలో ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాకు తాజాగా ఒమిక్రాన్‌ వెలుగు చూడడం కలవరపాటుకు గురిచేసింది.

విదేశాల నుంచి టియాంజిన్‌కు డిసెంబర్‌ 9 వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఆయనకు ఒమిక్రాన్‌ వేరియంట్‌గా నిర్ధారణ అయినట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు వెల్లడించారు.

మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ ప్రమాదకర వేరియంట్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్‌ దాదాపు 60 దేశాలకు పైగా వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌తో తొలి మరణం నమోదైంది. ప్రపంచంలో ఈ వేరియంట్‌తో మరణించిన తొలి కేసు కూడా ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని