Covid Waste: మహమ్మారి వేళ 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు!

కొవిడ్‌ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అయినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 10 Nov 2021 23:51 IST

లాస్‌ ఏంజెల్స్‌: ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యంతో పాటు అన్ని వ్యవస్థలపైనా కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా విరుచుకుపడిన కరోనా విజృంభణ సమయంలో ఒకేసారి వాడిపారేసే (Single Use) ప్లాస్టిక్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా సర్జికల్‌ మాస్కులు, ప్లాస్టిక్‌ గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు, టిష్యూ, కాటన్‌ స్వాబ్‌లు, సూదులు, సిరంజీల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా కొవిడ్‌ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అయినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో దాదాపు 25 వేల టన్నుల వ్యర్థాలు సముద్రగర్భంలో కలువనున్నట్లు అంచనా వేసింది. రానున్న మూడు, నాలుగేళ్లలోనే ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు బీచ్‌లు, సముద్ర గర్భంలోకి వచ్చిపడుతాయని తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు కొన్ని దేశాలు బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ చాలా దేశాలు మాత్రం వీటిపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు చైనాలోని నాంజింగ్‌ యూనివర్సిటీ, అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు నూతనంగా అభివృద్ధి చేసిన గణాంక పద్ధతిని వినియోగించారు. ఇందుకోసం 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆగస్టు 2021 వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగంపై ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. ముఖ్యంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలపై వీరు దృష్టి సారించారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎక్కువగా ఆసియా దేశాల నుంచే వస్తున్నట్లు గమనించారు.

‘వ్యక్తగతంగా వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు కాకుండా ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. ఇవి ఆసియా దేశాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. అయితే, అవి కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి కాకపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కాలిఫోర్నియా యూనివర్సిటికీ చెందిన పరిశోధకురాలు అమీనా షార్టప్‌ పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా నదుల నుంచి వచ్చి సముద్రాల్లో చేరుతున్నట్లు నాంజింగ్‌ యూనివర్సిటీకి చెందిన యాన్షూ ఝాంగ్‌ వెల్లడించారు.

ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు 73 శాతం ఆసియాలో ప్రవహించే నదుల నుంచే వస్తున్నాయి. ఇరాక్‌లోని షాట్‌ ఆల్‌-అరబ్‌, సింధూ, చైనాలోని యాంగ్జీ నదుల వల్లే అధిక మోతాదులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు మహాసముద్రాల్లో కలుస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. మరో 11 శాతం యూరప్‌ దేశాల నుంచి వస్తుండగా.. మిగతా వ్యర్థాలు ఇతర దేశాల నుంచి వచ్చి సముద్రాల్లో కలుస్తున్నాయని అంచనా వేసింది. ఇలా ప్లాస్టిక్‌ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో పీపీఈ కిట్లతోపాటు ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కలిగించాలని తాజా నివేదిక సూచించింది. ముఖ్యంగా వ్యర్థాల సేకరణ, శుద్ధి, రీసైక్లింగ్‌లో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ పర్యావరణ హాని కలిగించని విధంగా వ్యర్థాల తొలగింపు ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని