Covid 19: సాధారణ జలుబుగా మారనున్న కొవిడ్‌.. కానీ..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి రానున్న రోజుల్లో సాధారణ జలుబుగానే మారనుందని ఇంగ్లాండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ వ్యవస్థాపకుడు సర్‌ మాల్కమ్‌ గ్రాంట్‌ పేర్కొన్నారు...........

Published : 08 Oct 2021 22:14 IST

మరింత సమయం పడుతుందన్న ఇంగ్లాండ్‌ నిపుణులు

ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి రానున్న రోజుల్లో సాధారణ జలుబుగానే మారనుందని ఇంగ్లాండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ వ్యవస్థాపకుడు సర్‌ మాల్కమ్‌ గ్రాంట్‌ పేర్కొన్నారు. కానీ ఇందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్‌కు సంబంధించి మనకు తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని మాల్కమ్‌ గ్రాంట్‌ పేర్కొన్నారు. ‘ఇండియాటుడే’ కాంక్లేవ్‌ 2021లో పాల్గొన్న ఆయన.. ఆరోగ్యరంగంలో ఇప్పటికే భారత్‌ సాధిస్తోన్న పురోగతిలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు మరో అవకాశం వచ్చిందన్నారు.

‘భారత్‌లో సామాజిక పరిస్థితులు రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉన్నందున ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సంరక్షణలో ప్రతిసారి కేవలం ప్రభుత్వం నుంచే పెట్టుబడులు రావాల్సిన అవసరం లేదు. దేశ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రైవేటు రంగం కూడా దోహదం చేయవచ్చు’ అని యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌కు కులపతిగా ఉన్న మాల్కమ్‌ గ్రాంట్‌ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కొవిడ్‌-19 సాధారణ జలుబుగా మారుతుందని తెలిపారు. కానీ, ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ గురించి మనం అర్థం చేసుకున్న దానికంటే అర్థం కాని విషయాలే చాలా ఉన్నాయని మాల్కమ్‌ పేర్కొన్నారు.

ఇప్పటికీ వైరస్‌ ఉద్ధృతి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉందని మాల్కమ్‌ గ్రాంట్‌ వెల్లడించారు. అమెరికాలో ప్రతివారం వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. యూరప్‌లో కొవిడ్‌ మరణాలు, ఆస్పత్రిలో చేరికలు తగ్గినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రానున్న శీతాకాలంలో వైరస్‌ విజృంభణ మరింత పెరిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఎంతో మందికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేయాలని మాల్కమ్‌ గ్రాంట్‌ సూచించారు. కేవలం ఆస్పత్రుల్లోని వారికే కాకుండా మారుమూల ప్రాంతాలతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండే వారికి డిజిటల్‌ పద్ధతిలో కొవిడ్‌పై అవగాహన, శిక్షణ ఇవ్వాలన్నారు. ఇక ఆరోగ్య రంగంలో భారత్‌ ఇంకా పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మాల్కమ్‌ గ్రాంట్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని