
Covid Cases: బ్రిటన్‌కు మళ్లీ ఏమైంది..?
బూస్టర్లు ఇస్తున్నప్పటికీ.. ఆందోళనకరంగా కరోనా వ్యాప్తి
లండన్: బ్రిటన్ను కరోనా పీడ వదలడం లేదు. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఇవన్నీ కలిసి కరోనా వ్యాప్తికి ఊతం ఇచ్చాయి. రెండు వారాలుగా 35 నుంచి 40 వేల మధ్య నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 50 వేలకు చేరువయ్యాయి. అంటే జులై నాటి గరిష్ఠానికి చేరాయన్నమాట. వేసవికాలం నుంచి తరచుగా రోజుకు 100కు పైగా మరణాలు వెలుగుచూస్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 1.38 లక్షలకు చేరింది. మృతుల సంఖ్యలో ఐరోపాలో రష్యా తర్వాతి స్థానం బ్రిటన్‌దే.
‘ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జిమ్ నెయిస్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో శీతకాలం సమీపించింది. ఈ సమయంలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్య సేవలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మున్ముందు రోజులు వైద్య వ్యవస్థకు సవాలేనని వెల్లడించారు.
విద్యార్థుల్లో పెరుగుతోన్న కేసులు..
విద్యార్థుల్లో నమోదవుతోన్న కరోనా కేసులే ప్రస్తుత ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు సైమన్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో పాఠశాలకు వెళ్తోన్న విద్యార్థుల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. అలాగే మాస్క్‌లు తప్పనిసరి కాదు. అయితే కేసులు పెరిగితే విద్యార్థులు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల విషయంలో కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. వారు ఆ వైరస్‌తో పోరాడి కోలుకోగలరు. కానీ ఇంట్లో ఉండే పెద్దలు, ఉపాధ్యాయులు, టీకా తీసుకోనివారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి తాజా ఉద్ధృతి ఆందోళనకరంగా మారొచ్చని సైమన్ అన్నారు. ప్రస్తుతం అక్కడ సగటున రోజుకు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 900కి చేరింది. వేసవిలో 500కి పైగా ఉన్న ఆ సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. జులైలో బ్రిటన్ కొవిడ్ ఆంక్షలను తొలగించిన విషయం తెలిసిందే. భౌతిక దూరం, మాస్కులు, రద్దీ ప్రదేశాల్లో టీకా ధ్రువపత్రం తప్పనిసరికాదని ప్రకటించింది.
బూస్టర్లూ ఇస్తున్నారు..
బ్రిటన్ ప్రధానంగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాపైనే ఆధారపడింది. అలాగే ఈ దేశం ముందుగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతో టీకా యాంటీబాడీలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నలూ తలెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు 41 శాతం మంది బూస్టర్ డోసుల్ని స్వీకరించారు. అయితే ఫాలోఅప్ కార్యక్రమంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క మాస్కులు ధరించే విషయంలో బ్రిటన్ వాసులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 15 శాతం మంది ప్రజలు తాము ఎన్నడూ బహిరంగంగా మాస్కులు ధరించలేదని చెప్పారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ఆర్థికవ్యవస్థ పురోగమనంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అందుకే తిరిగి లాక్డౌన్, ఆంక్షలు విధించడంపై విముఖతతో ఉన్నారు. ‘మాస్కులు తప్పనిసరి చేయడం వంటి చర్యలు ఇప్పుడు అవసరంగా కనిపిస్తున్నాయి. శీతకాలం సమీపిస్తుండటంతో మన పరిస్థితి ఏంటో సమీక్షించుకోవడం సరైందే’ అని ప్రస్తుత పరిస్థితిపై నెయిస్మిత్ సూచనలు చేశారు.
కారణం వెతకాల్సిందే..
బ్రిటన్‌లో కేసుల పెరుగుదలపై అసలు కారణాన్ని వెతికిపట్టుకునేందుకు అత్యవసరంగా పరిశోధన చేపట్టాలని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమిషనర్ స్కాట్ గాట్లీబ్ పిలుపునిచ్చారు. డెల్టా వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ వ్యాప్తి ఏమేరకు ఉందో పరిశీలించాల్సి ఉందన్నారు. పాక్షికంగా రోగ నిరోధకతను తప్పించుకుంటుందా? అని గమనించాలన్నారు. ‘ఇప్పటికైతే అలాంటి సూచనలు ఏవీ లేనప్పటికీ.. కొత్త రకాలను వర్గీకరించడానికి మనం అత్యవసర పరిశోధన చేపట్టాలి. అందుకు తగ్గ వ్యవస్థ మన వద్ద ఉంది’ అని స్కాట్ అన్నారు.