Ex-Gratia for Covid Death: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ₹50వేలు పరిహారం!

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) సిఫార్సు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.......

Updated : 22 Sep 2021 22:03 IST

రాష్ట్రాలు అందజేస్తాయని సుప్రీంకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) సిఫార్సు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనున్నట్లు తెలిపింది. కొవిడ్‌ మరణ ధ్రువీకరణను కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కేవలం ఇప్పటివరకు మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కొవిడ్‌-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు విపత్తు సహాయం కింద రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిని విచారించిన సుప్రీంకోర్టు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా కొవిడ్‌ మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానానికి సంబందించి మార్గదర్శకాలు రూపొందించాలని అటు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (NDMA)కు ఆదేశాలు ఇచ్చింది. అయితే, పరిహారం ఎంత ఇవ్వాలన్నదానిపై తాము ఆదేశాలు ఇవ్వలేమని.. కేంద్ర ప్రభుత్వమే కనీస మొత్తాన్ని నిర్ధారించాలని సూచించింది. తొలుత ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నిరాకరించింది. నగదు రూపంలో పరిహారం ఇస్తే ఇతర కార్యక్రమాలకు నిధులు ఉండవని వాదించింది. ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పరిహారం ఇచ్చేందుకు మార్గదర్శకాలకు రూపొందించిన కేంద్రం.. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని