Modi: కరోనా సంక్షోభం రాజకీయాంశం కాదు..!

దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం రాజకీయాంశం కాదని.. మానవాళి ఎదుర్కొంటున్న సమస్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 20 Jul 2021 16:17 IST

భాజపా ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం

దిల్లీ: దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం రాజకీయాంశం కాదని.. మానవాళి ఎదుర్కొంటున్న సమస్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా తమ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని పునరుద్ఘాటించారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఇలాంటి మహమ్మారిని ప్రపంచం చవిచూస్తోందని భాజపా ఎంపీలతో ప్రధాని మోదీ పేర్కొన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.

మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ దేశంలో మెజారిటీ ప్రజలు రేషన్‌ పొందారని ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే, ఇలా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టడం సహాయంలో భాగం కాదని.. ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. అందుకే కరోనా సంక్షోభం తమకు రాజకీయాంశం కాదని గుర్తుచేసిన ఆయన, మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రతిపక్ష నాయకుల తీరును ప్రశ్నించారు. కరోనా విషయంలో పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కానీ, ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సిన్‌ విధానంపై ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం ఇవ్వాలని భాజపా ఎంపీలకు మోదీ సూచించారని చెప్పారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాక్సిన్‌ విధానంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటికితోడు తాజాగా వెలుగు చూసిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతం, ధరల పెరుగుదల, రైతుల ఆందోళనలు వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో ఉభయసభలు విపక్షాల ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని