Covid Antibodies: కొవిడ్‌ యాంటీబాడీలు ఎవరిలో ఎక్కువగా ఉంటున్నాయ్‌..?

వైరస్‌ బారినపడి కోలుకున్న తర్వాత రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకునే వారిలో అత్యధిక యాంటీబాడీలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో మరోసారి వెల్లడైంది.

Published : 02 Nov 2021 16:29 IST

అమెరికా అధ్యయనం ఏం చెబుతుందంటే..

వాషింగ్టన్‌: వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఎంతకాలం రక్షణ కల్పిస్తున్నాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే వారిలో, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఇవి ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయనే అంశంపై పరిశోధనలు కొనసాగుతన్నాయి. ఇందులో భాగంగా వైరస్‌ బారినపడి కోలుకున్న తర్వాత రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకునే వారిలో అత్యధిక యాంటీబాడీలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో మరోసారి వెల్లడైంది. ఈ అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

కొవిడ్‌-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వృద్ధి చెందే యాంటీబాడీలు ఎంతకాలం ప్రభావవంతంగా పనిచేస్తున్నాయే తెలుసుకునేందుకు అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్న 1960 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని పరీక్షించారు. వీరిలో తొలిడోసు తీసుకోకముందే 73 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిని రెండు వర్గాలుగా విభజించిన నిపుణులు, వారి యాంటీబాడీల స్థాయిలను ఇంతకుముందెన్నడూ వైరస్‌కు గురికాని వారితో పోల్చి చూశారు. ఇలా మూడు, ఆరు నెలల వ్యవధిలో పలుసార్లు యాంటీబాడీల స్థాయిలను పరీక్షించి పోల్చి చూశారు. ఇదే విధంగా రెండోడోసు తీసుకున్న తర్వాత మొదటి నెల, మూడో నెలలోనూ వారి యాంటీబాడీలను పరీక్షించారు.

కేవలం రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే.. ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత రెండుడోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనే అధిక యాంటీబాడీలు ఉన్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి (JHU) చెందిన డయానా ఝాంగ్‌ పేర్కొన్నారు. రెండోడోసు తీసుకున్న నెల తర్వాత వీరిలో యాండీబాడీల వ్యత్యాసం 14శాతం ఉండగా.. మూడు నెలల తర్వాత 19శాతం ఉన్నట్లు కనుగొన్నారు. ఆరు నెలల తర్వాత ఈ యాంటీబాడీల్లో వ్యత్యాసం 56శాతం కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌కు తొలిడోసుకు మధ్య ఎక్కువ సమయం ఉన్నట్లయితే యాంటీబాడీల ప్రతిస్పందన అధికంగా ఉన్నట్లు జేహెచ్‌యూ ప్రొఫెసర్‌ ఆరొన్‌ మిల్‌స్టోన్‌ పేర్కొన్నారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారికి సుదీర్ఘ సమయం తర్వాత వ్యాక్సిన్‌ అందించాలా? అనే అంశాన్ని ధ్రువీకరించేందుకు మరిన్ని విశ్లేషణలు జరగాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ మిల్‌స్టోన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని