
Vaccine for Children: స్కూళ్లు తెరవాలంటే.. పిల్లలకు టీకా తప్పనిసరా?
క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: దేశంలో పాఠశాలలు తెరవాలంటే చిన్నారులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ విభాగం గానీ, నిపుణులు గానీ సూచించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులకు వ్యాక్సిన్ అవసరమేనని తెలిపింది. కేవలం అతికొద్ది దేశాలు మాత్రమే చిన్నారులకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ మొదలు పెట్టాయని పేర్కొంది. పాఠశాలలను తిరిగి తెరవాలంటే చిన్నారులకు వ్యాక్సిన్ తప్పనిసరా? అని అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) వీకే పాల్ పైవిధంగా సమాధానమిచ్చారు.
పాఠశాలలు తిరిగి తెరిచేందుకు వ్యాక్సిన్ ఒక్కటే కాకుండా వైరస్ సంక్రమణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా వెంటిలేటర్లు, కూర్చునే ఏర్పాట్లు, తరగతులు, మాస్కులు ధరించడం వంటి పరామితులు పాఠశాలలు తెరిచేందుకు కీలకమని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్, నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ పేర్కొన్నారు. పాఠశాలలు తెరవాలంటే చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ చిన్నారుల కోసం రూపొందించిన కరోనా వ్యాక్సిన్ల వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్ధారించుకునేందుకు క్రియాశీలంగా పనిచేస్తున్నామని అన్నారు.
చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు జైడస్ క్యాడిలాకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిని ఎటువంటి ఆటంకం లేకుండా పంపిణీ చేసే ప్రక్రియపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఇక భారత్ బయోటెక్తోపాటు, బయోలాజికల్ -ఇ సంస్థలు కూడా చిన్నారుల కోసం టీకాను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని.. త్వరలోనే అవి కూడా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.