CoronaVaccine: 1,40,000 మంది ప్రాణాలు కాపాడిన కొవిడ్‌ టీకా

ప్రాణం చాలా విలువైనది.. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు

Published : 18 Oct 2021 10:15 IST

అమెరికాలో పరిశోధకుల వెల్లడి

ఇండియానాపోలిస్‌: ప్రాణం చాలా విలువైనది.. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 49 లక్షల మందికి పైగా ప్రజలను బలి తీసుకుంది. ఇంతటి విలయతాండవం నుంచి ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నది టీకాలేనని అమెరికా శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. కొవిడ్‌ టీకాలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ‘ఇండియానా యూనివర్సిటీ - పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్‌ (ఐయూపీయూఐ)’ పరిశోధకులు తేటతెల్లం చేశారు. పలు అధ్యయనాల ప్రకారం అమెరికాలో ఈ ఏడాది మే 9 నాటికి 1,40,000 మంది ప్రాణాలను కొవిడ్‌ టీకాలు కాపాడినట్లు వెల్లడించారు. అంతేకాదు ఎన్నో విధాలుగా టీకాలు కొవిడ్‌ను సమర్థంగా నియంత్రిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ సోకినా తీవ్రస్థాయికి చేరుకోకుండా.. మరీ ముఖ్యంగా ప్రాణాపాయం నుంచి టీకాలు కాపాడుతున్నాయని తెలిపారు. ఒక డోసు కంటే రెండు డోసులు తీసుకున్నవారిలో వ్యాక్సిన్‌ మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ద్వారా ఇతరులకు కొవిడ్‌ వ్యాప్తి కూడా గణనీయంగా తగ్గినట్లు ఐయూపీయూఐ హెల్త్‌ ఎకనమిస్ట్‌ సుమేధ గుప్త తెలిపారు. తన బృందంతో కలిసి ఆమె పలు పరిశోధనలు జరిపారు. వీరంతా అమెరికాలో ప్రజల ప్రాణాలను టీకాలు ఎలా కాపాడుతున్నాయన్న విషయమై అధ్యయనం చేశారు. 2021 మార్చి నుంచి ఈ బృందం పరిశోధనలు ప్రారంభించింది. అత్యధిక, అతితక్కువ వ్యాక్సినేషన్‌ జరిగిన రాష్ట్రాలను పరస్పరం పోల్చిచూస్తూ.. ఓ నమూనా ద్వారా పరిస్థితిని విశ్లేషించారు. ఆయా రాష్ట్రాల్లో జనసాంద్రత, కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తున్న విధానాలపైనా పరిశోధించారు. ఈ అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత 2021 మే 9 నాటికి అమెరికాలో 5,69,193 కొవిడ్‌ మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు.

అయితే వీరి అంచనాలకు 2% మించి ఆ తేదీ నాటికి 5,78,862 మంది చనిపోయారు. ఒకవేళ కొవిడ్‌ టీకా అందుబాటులోకి రాకపోయి ఉంటే ఆ రోజు సరికి ఏకంగా 7,08,586 మంది చనిపోయి ఉండేవారని తేల్చారు. ఈమేరకు టీకాలు 1,40,000 మందిని కాపాడినట్లు తమ నమూనా నిర్ధారించినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన కొద్ది నెలల్లో చేపట్టిన అధ్యయనానికే ఇలాంటి గొప్ప ఫలితాలు వచ్చాయని.. అలాగే అప్పటికి కొన్ని రాష్ట్రాల్లో టీకాలు వేసే కార్యక్రమం మందకొడిగా సాగుతోందని వెల్లడించారు. ఇక తర్వాతి కాలంలో వ్యాక్సినేషన్‌ మరింత ఊపందుకుని.. అత్యధిక సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడుతోందని, మరెంతో మంది వీటిద్వారా రక్షణ పొందుతారని గట్టిగా చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని