Updated : 13 Nov 2021 05:43 IST

Bipin Rawat: కొవిడ్‌ వేళ.. 500శాతం పెరిగిన సైబర్‌ నేరాలు!

ఐటీ చట్టానికి సవరణలు అవసరమన్న త్రిదళాధిపతి

దిల్లీ: మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో సైబర్‌ నేరాలు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి సైబర్‌ నేరాల్లో దాదాపు 500శాతం పెరుగుదల కనిపించినట్లు భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరోసారి గుర్తుచేశారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం, రాన్సమ్‌వేర్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌తో కలిగే ముప్పును ప్రముఖంగా ప్రస్తావించారు. ‘c0C0n’ పేరుతో కేరళ పోలీసులు వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన 14వ ‘హ్యాకింగ్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఐటీ చట్టాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఐటీ చట్టానికి సవరణలు అవసరం..

సైబర్‌ భద్రత కోసం రాష్ట్రస్థాయిలో సైబర్‌ సెల్‌లు, కేంద్ర స్థాయిలోనూ వివిధ శాఖలకు నిపుణులు ఉన్నారు. ఇందుకోసం వివిధ మంత్రిత్వ శాఖలు కూడా పలు ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఇలా డిజిటల్‌ సమాచారాన్ని సమర్థవంతంగా భద్రపరచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ జాతీయ స్థాయిలో ఈ వర్చువల్‌ స్పేస్‌ నిర్వహణ కోసం ఓ ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ అవసరం ఉందని త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. రోజురోజుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోన్న సమయంలో.. వీటితో ఎదురయ్యే ప్రమాదాలను కూడా అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా డ్రోన్లు, రాన్సమ్‌వేర్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలతో పొంచివున్న ముప్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వర్చువల్‌ కరెన్సీ, బ్లాక్‌చెయిన్‌ వ్యాప్తి కూడా ఎక్కువైన నేపథ్యంలో మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా భారత చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ చట్టం-2000కు సవరణలు చేయాల్సిన అవసరాన్ని జనరల్‌ బిపిన్‌ రావత్‌ నొక్కిచెప్పారు. దీనికి తోడు డేటా సంరక్షణ బిల్లు (Data Protection Bill) 2019 కూడా సాధ్యమైనంత తొందరగా చట్టరూపం దాల్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో చోటుచేసుకున్న ఆన్‌లైన్‌ మోసాలపై చర్చించే లక్ష్యంతో సొసైటీ ఫర్‌ ది పోలీసింగ్‌ ఆఫ్‌ సైబర్‌స్పేస్‌ (POLCYB), ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (ISRA) స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కేరళ పోలీసులు ‘c0c0n’ సదస్సు నిర్వహించారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని సైబర్‌ సెక్యూరిటీపై కీలక ప్రసంగాలు చేశారు. సైబర్‌నేరాలు, హ్యాకింగ్‌పై ప్రజల్లో అవగాహన కలిగించడంతోపాటు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతోన్న సమయంలో ఎన్నో నేరాలు చోటుచేసుకున్న దృష్ట్యా ఆన్‌లైన్‌ భద్రతపై చిన్నారులకు కూడా దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం గతేడాది (2000) దేశవ్యాప్తంగా 50,035 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. 2019లో సుమారు 27వేల సైబర్‌ నేరాలు చోటుచేసుకోగా 2019లో 44వేలకు పెరిగాయి. గతేడాది దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ సైబర్‌ నేరాల్లో దాదాపు 12శాతం పెరుగుదల కనిపించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని