Vaccine Mixing.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ఏమన్నారంటే..!

వేర్వేరు వ్యాక్సిన్‌లను కలిపి ఇచ్చే విధానం సరైంది కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా స్పష్టం చేశారు.

Published : 13 Aug 2021 22:45 IST

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ మిక్సింగ్‌పై కొనసాగుతోన్న అధ్యయనం

దిల్లీ: వేర్వేరు సంస్థలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌లను మిక్సింగ్‌ విధానంలో ఇవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో భారత్‌లోనూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ డోసులను మిశ్రమ పద్ధతిలో (Vaccine Mixing) ఇచ్చే విధానంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీటి అధ్యయనానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం కూడా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కొవిషీల్డ్‌ తయారు చేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై స్పందించారు. వేర్వేరు వ్యాక్సిన్‌లను కలిపి ఇచ్చే విధానం సరైంది కాదని స్పష్టం చేశారు. వీటి వల్ల తయారీ సంస్థల మధ్య ఆరోపణలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్‌ డోసులను మిశ్రమ పద్ధతిలో ఇచ్చే అవసరం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా (Cyrus Poonawalla) పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఒక వేళ ఏదైనా తప్పు జరిగితే వ్యాక్సిన్‌ తయారీ సంస్థల మధ్య నిందారోపణలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రయోగ దశల్లో వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనాలు జరగలేదనే విషయాన్ని పూనావాలా గుర్తుచేశారు. పుణెలోని తిలక్‌ మహారాష్ట్ర విద్యాపీఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సైరస్‌ పూనావాలా ఈ విధంగా స్పందించారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా సాగుతున్న సమయంలో వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఇది సురక్షితమేనని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) వెల్లడించింది. అంతేకాకుండా ఒకే వ్యక్తికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండు ఒకే డోసుల కంటే వేర్వేరు డోసులను ఇవ్వడం వల్ల అధిక రోగనిరోధక ప్రతిస్పందనలు కనిపించాయని తెలిపింది. ఈ విధానంపై 300 మంది వాలంటీర్లపై వెల్లూర్‌లోని క్రిష్టియన్‌ మెడికల్‌ కాలేజీ (CMC) అధ్యయనం జరుపుతోంది. ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ (Serum Institute) ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని