Dalai Lama: భారత్‌... మతసామరస్యంలో ప్రపంచానికే రోల్‌మోడల్‌..!

మతసామరస్యంలో భారత్‌ ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (86) ఉద్ఘాటించారు.

Published : 19 Dec 2021 16:23 IST

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా

దిల్లీ: మతసామరస్యంలో భారత్‌ ప్రపంచానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (86) ఉద్ఘాటించారు. శ్రీలంకన్‌ టిబెటన్‌ బుద్ధిస్ట్‌ సొసైటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన వేల ఏళ్లుగా భారత్‌ అహింసా మార్గాన్ని అనుసరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండోనేషియా, మలేసియా, భారత్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయిలాండ్‌కు చెందిన వందల మంది బౌద్ధ గురువులు పాల్గొనగా.. వారికి బుద్ధుడి బోధనలోని ఆంతర్యాలను దలైలామా వివరించారు.

‘భారతీయ మత సంప్రదాయం అహింసను బోధిస్తుంది. ఇతరులకు హాని కలిగించదు. భారత్‌లో అహింసా, కరుణా అనేవి 3వేల ఏళ్లుగా పాటిస్తున్నారు. ఇస్లాం, క్రిష్టియానిటీ, జైనులు, యూదులు వంటి ప్రపంచంలోని ఎన్నో మతాలకు చెందినవారు ఇక్కడ కలిసి జీవిస్తున్నారు. మత సామరస్యంలో భారత్‌ ప్రపంచానికే మార్గదర్శి. నేను శరణార్థిగా భారత్‌ వచ్చినప్పటి నుంచి ఇక్కడి అహింస, మత సామరస్యం పాటించడాన్ని అద్భుతమైందిగా గుర్తించాను’ అని దలైలామా పేర్కొన్నారు. ఇక బుద్ధుడి బోధనలను విశ్లేషించే స్వేచ్ఛ ఆయనే మనకు ఇచ్చాడన్న దలైలామా.. ఆయన బోధనలను హేతుబద్ధంగా ఎంత ఎక్కువగా విశ్లేషిస్తే అంత వాస్తవాలను పొందగలమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల బౌద్ధ గురువులకు సూచించారు.

ఇక ఇటీవలే చైనా నాయకత్వాన్ని దలైలామా విమర్శించిన విషయం తెలిసిందే. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోలేరన్న ఆయన.. ముఖ్యంగా అక్కడ హాన్‌వర్గం ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువ ఉందన్నారు. అయితే, తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. భారత్‌లోనే ఉంటానని, ఇక్కడే ప్రశాంతంగా ఉందని దలైలామా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని