Omicron Scare: క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై దిల్లీలో నిషేధాజ్ఞలు

కరోనా కొత్త వేరియంట్ దిల్లీలో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశ రాజధాని నగరంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

Updated : 22 Dec 2021 18:11 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దిల్లీలో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశ రాజధాని నగరంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. అక్కడ కొత్త వేరియంట్ బాధితులు 57కి పెరిగారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై నిషేధాజ్ఞలు విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సమావేశాలపై నిషేధం విధించింది. ఈ మేరకు దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. 

దిల్లీ పాలనాయంత్రాంగం, పోలీసులు ఈ ఆదేశాలు పాటించాలని వెల్లడించింది. అలాగే జిల్లా అధికారులు రోజూవారీ నివేదికలను సమర్పించాలని తెలిపింది. మాస్క్ ధరించని వినియోగదారుల్ని అనుమతించవద్దని మార్కెట్‌ ట్రేడ్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

దేశంలో ఇప్పటివరకు 215 మంది ఈ కొత్త వేరియంట్‌ బారినపడ్డారు. వారిలో సుమారు 90 మంది కోలుకున్నారని కేంద్రం వెల్లడించింది. దిల్లీ తర్వాత మహారాష్ట్రలో 54 మందికి ఈ వేరియంట్ సోకింది. మొత్తంగా 15 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది. దీనిపై  ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది.  డెల్టా రకం కంటే కొత్త వేరియంట్‌కు 3 రెట్లు ఎక్కువ సాంక్రమిక శక్తి ఉన్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వార్‌ రూమ్‌ల (అత్యవసర కార్యకలాపాల నిర్వహణ కేంద్రాలు)ను క్రియాశీలం చేయడంతో పాటు కేసులు ఏమాత్రం పెరిగినా జిల్లా, స్థానిక స్థాయిల్లో కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ సతీమణికి కరోనా..

యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌ కరోనా బారినపడ్డారు. ట్విటర్ వేదికగా డింపుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. అలాగే అఖిలేశ్‌ కుమార్తెకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అఖిలేశ్ యాదవ్‌కు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని