Rakesh Asthana: దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా..ఆస్తానా మాకొద్దు..!

దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన మాజీ సీబీఐ అధికారి రాకేశ్‌ ఆస్తానా తమకు వద్దంటూ ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 30 Jul 2021 01:19 IST

అసెంబ్లీలో తీర్మానం చేసిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన మాజీ సీబీఐ అధికారి రాకేశ్‌ ఆస్తానా తమకు వద్దంటూ ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం.. దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆస్తానా పదవీ విరమణకు కేవలం మూడు రోజుల ముందే దిల్లీ పోలీస్‌ బాస్‌గా కేంద్రం నియమించడం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 31న రాకేశ్‌ ఆస్తానా పదవీకాలం ముగియనున్న సందర్భంలో దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా కేంద్రం నియమించడం మరోసారి చర్చకు దారితీసింది.

‘సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాకేశ్‌ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం నియమించిందని భావిస్తున్నాం. అంతేకాకుండా సుప్రీం ఆదేశాలను పాటించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అందుకు అనుగుణంగానే నియామకాలు జరగాలి’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీబీఐ చీఫ్‌గా అనర్హుడైన వ్యక్తి, దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా కూడా అనర్హుడేనని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా డీజీ స్థాయి పోస్టులో నియామకం జరగాలంటే కనీసం ఆరు నెలల పదవీకాలం ఉండాలని.. కానీ, ఆస్తానాకు కేవలం నాలుగు రోజులే ఉందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ గుర్తుచేశారు. అటువంటప్పుడు రాకేశ్‌ ఆస్తానాను కేంద్రం ఏవిధంగా నియమిస్తుందని ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానా బీఎస్‌ఎఫ్ డైరెక్టర్‌ జనరల్‌, బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అదనపు డీజీగా పనిచేశారు. 1984 బ్యాచ్‌‌ గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఆస్తానా పేరు ‘సీబీఐ వర్సెస్‌ సీబీఐ’ వ్యవహారంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్తానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సీబీఐ నుంచి తొలగించారు. అయితే, సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయన ఎస్పీగా ఉన్న సమయంలో దాణా కుంభకోణంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఆస్తానానే అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని