Afghanistan: అఫ్గాన్‌ నుంచి భారతీయుల తరలింపు

భారత రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కాబూల్‌లోని భారత పౌరుల ప్రాణాలను అవసరమైన సమయంలో స్వదేశానికి తరలించే ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 15 Aug 2021 22:13 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీంతో కాబూల్‌లో ఉద్రిక్త, భయానక వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు దిల్లీ-కాబూల్‌ మధ్య నడిచే విమాన సర్వీసులపై పడ్డాయి. ‘ప్రస్తుతం అఫ్గాన్‌లో వేగంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. భారత రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కాబూల్‌లోని భారత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టం’ అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. వారిని అవసరమైన సమయంలో స్వదేశానికి తరలించే ఏర్పాట్లతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన C-17 విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.

ఎయిరిండియా విమానంపై ఉత్కంఠ..

దిల్లీ నుంచి కాబూల్‌కు ఆదివారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానం బయలుదేరిన సమయంలో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సమయానికే కాబూల్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారనే ప్రకటన వెలుబడింది. అదే సమయంలో కాబూల్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి అనుమతిచ్చేందుకు ఏటీసీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా పైలట్.. శత్రువులకు లక్ష్యంగా కాకుండా ఉండేందుకు విమాన రాడార్‌ వ్యవస్థను ఆఫ్‌ చేశారు. చివరకు గంట ఆలస్యంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టులో విమానం దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ అదే విమానం 129 ప్రయాణికులతో దిల్లీకి చేరుకుంది.

ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాలిబన్ల ప్రతినిధులు మాత్రం తాము కాబూల్‌ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం లేదని పేర్కొంటున్నారు. కాబూల్‌ వాసులు ఎటువంటి భయభ్రాంతులకు గురికావద్దని.. ప్రతీకారం తీర్చుకోవడానికి నగరంలోని ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం తమకు లేదని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగే అవకాశం ఉందని అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్‌ సత్తార్‌ మిర్జక్వాల్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని