Published : 18 Nov 2021 18:24 IST

AY.4.2 వేరియంట్‌: లక్షణాలు తక్కువ.. వ్యాప్తి ఎక్కువ!

బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడి

లండన్‌: బ్రిటన్‌లో వెలుగు చూసిన ఏవై.4.2 (AY.4.2) కొత్తరకం వేరియంట్‌ విస్తృత వ్యాప్తి చెందుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్‌ను వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌గా పేర్కొన్న పలు దేశాలు.. వైరస్‌ తీవ్రతను అంచనా వేసేందుకు అధ్యయనాలు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా ఏవై.4.2 రకానికి వ్యాప్తిచెందే గుణం ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వైరస్‌ వ్యాప్తి, వాటి ప్రభావాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌లో జరిపిన వాస్తవ ఫలితాల విశ్లేషణలో ఈ విషయం తేలింది.

పలు దేశాల్లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్‌ (Delta Variant).. రూపాంతరం చెంది ఏవై.4.2 రకంగా వ్యాప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌, ఇప్సోస్‌ మోరీ (Ipsos MORI) పరిశోధకులు వాస్తవ ఫలితాలను విశ్లేషించారు. ఇందుకోసం అక్టోబర్‌ 19 నుంచి నవంబర్‌ 5 వరకు ఇంగ్లాండ్‌లో లక్ష మంది కొవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషించారు. తద్వారా ఏవై.4.2 వేరియంట్‌ నిత్యం 2.8శాతం పెరుగుదల రేటుతో వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లో వైరస్‌ ఉద్ధృతికి ఇదే ప్రధాన కారణమనే నిర్ధారణకు వచ్చారు.

లక్షణాలు తక్కువే..

ఏవై.4.2 వేరియంట్‌ సోకిన వారిలో రుచి, వాసన కోల్పోవడం, జ్వరం, దగ్గుతో పాటు వర్గీకరించిన కొవిడ్‌ లక్షణాలు (Covid Symptoms) తక్కువగానే కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. డెల్టా రకం సోకిన వారిలో 46శాతం లక్షణాలు కనిపించగా.. ఏవై.4.2 రకం నిర్ధారణైన వారిలో కేవలం 33శాతం మందిలోనే లక్షణాలు కనిపించాయి. అయితే, ‘వైరస్‌ విస్తృతంగా ఎందుకు వ్యాపిస్తుందో మాకు తెలియదు. తక్కువ లక్షణాలు మాత్రమే ఉన్నట్లు కనిపించింది’ అని ఇంపీరియల్‌ కాలేజీ ప్రజారోగ్య విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ పాల్‌ ఎల్లియోట్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ రేటు మాత్రం అధికంగానే ఉందన్నారు. గతంలో గరిష్ఠంగా నమోదైన కొవిడ్‌ కేసులు, మరణాలతో పోలిస్తే వాటి సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉందని ప్రొఫెసర్‌ పాల్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలు పాఠశాలలకు వెళుతున్న వేళ.. వైరస్‌ ప్రాబల్యం మరోసారి మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంచనా వేశారు.

బూస్టర్‌తో రక్షణ..

ఇక వైరస్‌ను ఎదుర్కోవడంలో బూస్టర్‌ డోసుల సమర్థతపైనా లండన్‌ పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలా మందికి బూస్టర్‌ డోసులు అందించగా.. రెండు డోసులు పొందినవారితో పోలిస్తే మూడోడోసు తీసుకున్న వారికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు మూడురెట్లు తక్కువగా ఉందని గుర్తించారు. ప్రస్తుతం అక్కడ 50ఏళ్ల వయసుపైబడిన వారికి మూడో డోసు అందిస్తున్నారని.. ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ జెన్నీ హారిస్‌ పేర్కొన్నారు. ఏదేమైనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టిన నుంచి కొవిడ్‌ మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించిందని మరో శాస్త్రవేత్త క్రిసిల్‌ డోనెలీ వెల్లడించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని