Deshbhakti: దిల్లీ స్కూళ్లలో పాఠ్యాంశంగా ‘దేశభక్తి’..!

చిన్నారుల్లో దేశం పట్ల ప్రేమ, దేశభక్తి పెంపొందించే చర్యల్లో భాగంగా పాఠశాల ప్రణాళికలోనే మార్పులు తీసుకువస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ‘దేశభక్తి’ పాఠ్యాంశాలను అమలు చేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

Published : 15 Aug 2021 16:27 IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: చిన్నారుల్లో దేశం పట్ల ప్రేమ, దేశభక్తి పెంపొందించే చర్యల్లో భాగంగా పాఠశాల ప్రణాళికలోనే మార్పులు తీసుకువస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ‘దేశభక్తి’ పాఠ్యాంశాలను అమలు చేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వెల్లడించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ సెక్రెటేరియట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన.. ప్రస్తుతమున్న పాఠ్యప్రణాళిక కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలను మాత్రమే నేర్పిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుచేత ప్రతి చిన్నారిలో దేశం పట్ల గొప్ప అనుభూతిని కలిగించడంతో పాటు దేశం కోసం సర్వస్వం అర్పించడానికి సిద్ధంగా ఉన్నామనే భావన వారిలో కలిగించే లక్ష్యంతో ఈ నూతన పాఠ్య ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌కు నివాళిగా సెప్టెంబర్‌ 27 నుంచి నూతన పాఠ్యాంశాలను అమలు చేస్తామని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.

అక్టోబర్‌ 2 నుంచి యోగా తరగతులు..

యోగాను భారత్‌ యావత్‌ ప్రపంచానికి అందించినప్పటికీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అందరికీ చేరలేదు. కేవలం జూన్‌ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు మాత్రమే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అందుకే యోగాను మరింత విస్తృత పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి వెల్లడించారు. అక్టోబర్‌ 2 నుంచి దిల్లీలోని పలు హాళ్లు, పార్కుల్లో యోగా కోసం ప్రత్యేక శిక్షణను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం భారీ స్థాయిలో యోగా టీచర్లు, శిక్షకులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యోగా నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులు తమ వద్దకు వస్తే వారికి ప్రత్యేకంగా శిక్షకులను అందుబాటులో ఉంచుతామని అన్నారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయులను యావత్‌ దేశం స్మరించుకుంటోంది. ఓ వైపు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే.. 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాలను దేశప్రజలు జరుపుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని