
Narendra Modi: రాజకీయ నేపథ్యం లేకున్నా.. 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా!
ప్రజల ఆశీర్వాదంతోనే అన్న ప్రధాని మోదీ
సూరత్: ఎలాంటి రాజకీయ నేపథ్యం, వంశపారంపర్య మద్దతు లేకున్నా దేశానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు గుజరాత్ సీఎం నుంచి నేడు ప్రధానమంత్రిగా సేవలందించే భాగ్యం కల్పించారన్నారు. సూరత్‌లో ఓ బాలుర వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. కేవలం ప్రజల ఆశీస్సులతోనే గడిచిన 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నానని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. నాకు రాజకీయ, వంశపారపర్య లేదా ప్రత్యేకంగా కులాల మద్దతు లేదు. అయినప్పటికీ మీ అందరి ఆశీర్వాదంతో 2001 నుంచి గుజరాత్‌కు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవే ఆశీర్వాదాలు బలంగా ఉండడంతోనే 20 ఏళ్లైనా దేశ సేవలో కొనసాగుతున్నానని అన్నారు. గుజరాత్ సీఎం నుంచి ప్రస్తుతం దేశ ప్రధానిగా సేవచేసే అవకాశం కల్పించారని అన్నారు. అంతేకాకుండా భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కుల, మత విశ్వాసాలు మనకు అడ్డంకిగా మారకూడదని సర్దార్ పటేల్ చెప్పేవారని ప్రధాని మోదీ గుర్తుచేశారు.