Updated : 09 Nov 2021 15:47 IST

Devendra Fadnavis: చెప్పినట్టే.. నవాబ్‌ మాలిక్‌పై దీపావళి బాంబు పేలింది..!

సంచలన విషయాలు వెల్లడించిన ఫడణవీస్‌

ముంబయి: ముంబయిలోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. దానిలో భాగంగానే మంగళవారం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ గురించి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు. చెప్పినట్లుగానే దీపావళి తర్వాత బాంబు పేల్చారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘దీపావళి తర్వాత కొన్ని విషయాలు బయటపెడతానని ముందే చెప్పాను. దానికి సంబంధించిన పత్రాలు అందడానికి కొంచెం సమయం పట్టింది. నేను ఎవరో రాసింది చదవడం లేదు. నవాబ్‌ మాలిక్‌కు చీకటి సామ్రాజ్యం(అండర్ వరల్డ్)తో సంబంధాలున్నాయి. 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అండర్‌ వరల్డ్ వ్యక్తితో మాలిక్ ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు. కుర్లాలో ఎల్‌బీఎస్ రోడ్డులో 2.80 ఎకరాల స్థలాన్ని గోవాలా కాంపౌండ్ అని పిలుస్తారు. దానికి సాలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిస్ట్రేషన్ ఉంది. ఆ కంపెనీ నవాబ్ కుటుంబానికి చెందినది. ఆయన కూడా ఆ కంపెనీలో బాధ్యతలు నిర్వహించేవారు. అయితే మంత్రి అయిన తర్వాత కంపెనీ నుంచి వైదొలిగారు. నేను చెప్పిన స్థలాన్ని అండర్ వరల్డ్ నుంచి రూ.30 లక్షలకే కొనుగోలు చేశారు. కేవలం రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారు. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందనేది నా ప్రశ్న? మీకు సలీం పటేల్ తెలీదా? ఎందుకు మీరు ఆ దోషుల నుంచి భూమి కొన్నారు? ఎల్‌బీఎస్‌ రోడ్డులో ఆ స్థలాన్ని కేవలం రూ.30 లక్షలకే వారు మీకెందుకు అమ్మేశారు?’ అంటూ ఫడణవీస్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇది నవాబ్‌కు అండర్‌ వరల్డ్‌తో ఉన్న సంబంధాలను వెల్లడిచేస్తోంది. వాళ్లు ఆర్డీఎక్స్ కొనుగోలు చేసి, పేలుళ్లకు పాల్పడతారు. వారితో మంత్రి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు. ఈ వివరాల్నింటిని సంబంధిత యంత్రాంగానికి అందజేస్తాను. అలాగే ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు కూడా ఇస్తాను. అప్పుడే మాలిక్ ఎలాంటి వ్యక్తో ఆయనకు కూడా తెలుస్తుంది’ అంటూ ఆరోపణలు చేశారు. 

గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీం సన్నిహితుడే సలీం పటేల్. దావుద్ సోదరి హసీనా పార్కర్‌కు డ్రైవర్‌గా పనిచేశాడు. దావుద్ దేశం విడిచిపారిపోయిన తర్వాత ఈ డ్రైవర్ ద్వారానే హసీనా తన సోదరుడి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంది.

క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన దగ్గరి నుంచి నవాబ్ మాలిక్ సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఆరోపణలు చేయడమే కాకుండా ఫడణవీస్‌ను ఇందులోకి లాగారు. డ్రగ్స్ సరఫరాదారుతో మాజీ ముఖ్యమంత్రి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. దీనిపై ఫడణవీస్ స్పందిస్తూ.. దీపావళి తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తామన్నారు. అలాగే మాలిక్‌కు అండర్‌ వరల్డ్‌తో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తామన్నారు. దానిలో భాగంగానే ఈ మీడియా సమావేశం నిర్వహించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని