Dharavi: ఒమిక్రాన్‌ కలవరం.. ముంబయి ‘ధారావి’లో తొలి కేసు!

ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా పేరుగాంచిన ధారావిలో ఒమిక్రాన్‌ బయటపడింది. ధారావికి చెందిన ఓ 45ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

Published : 10 Dec 2021 21:20 IST

అప్రమత్తమైన ముంబయి మున్సిపల్‌ అధికారులు

ముంబయి: ఆందోళనకర వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్‌ రకం కేసుల సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25 ఒమిక్రాన్‌ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో ముంబయిలో తాజాగా మరోకేసు వెలుగు చూసింది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా పేరుగాంచిన ధారావిలో ఒమిక్రాన్‌ బయటపడింది. ధారావికి చెందిన ఓ 45ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ 4న ఆయన టాంజానియా నుంచి ముంబయి చేరుకున్నట్లు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన సన్నిహితంగా మెలిగిన వారిని ట్రాక్‌చేసే పనిలో నిమగ్నమయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఎట్‌-రిస్క్‌’ దేశాల జాబితాలో టాంజానియా లేకపోవడంతో ధారావికి చెందిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే నేరుగా వెళ్లిపోయారు. అయితే, సాధారణంగా విదేశాలనుంచి వచ్చేవారికి ర్యాండమ్‌ పద్ధతిలో చేస్తున్న కొవిడ్‌ పరీక్షల్లో భాగంగా ఆయన శాంపిళ్లను సేకరించారు. అందులో పాజిటివ్‌ తేలడంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అందులో ఆయనకు సోకింది ఒమిక్రాన్‌ వేరియంట్‌ అని తాజాగా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనను ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని.. బాధితుడిని స్థానిక సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రికి తరలించి పర్యవేక్షిస్తున్నామని బీఎంసీ అధికారులు వెల్లడించారు.

ముంబయి ధారావిలో కొవిడ్‌ కేసు అనగానే నగరమంతా అప్రమత్తమవుతోంది. రెండున్నర చదరపు కి.మీ విస్తీర్ణంలో దాదాపు 6 లక్షలకుపైగా జనాభా కలిగిన ధారావి ప్రాంతంలో తాజాగా ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధిక జనసాంద్రత, చిన్న చిన్న గృహాల్లోనే పదుల సంఖ్యలో నివసిస్తుండడం ఇందుకు కారణమవుతోంది. అయినప్పటికీ సెకండ్‌ వేవ్‌ సమయంలో కొవిడ్‌ విజృంభణకు ఎదురొడ్డి నిలిచిన ధారావి.. కొవిడ్‌ కట్టడిలో యావత్‌ దేశానికి ఓ మోడల్‌గా నిలిచింది. ఇదే సమయంలో అత్యంత వేగంగా వ్యాపించగల ఒమిక్రాన్‌ బయటపడడం అక్కడి అధికారులను కలవరపెడుతోంది. ఇక ధారావిలో నమోదైన కేసుతో ముంబయిలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో మాత్రం ఈ సంఖ్య 11కు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని