Bengaluru: ఒకే అపార్ట్​మెంట్​లో 27 మందికి కరోనా.. బ్యాడ్మింటన్​ ఆడటమే కారణం!

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే అపార్ట్​మెంట్​కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఓ బ్యాడ్మింటన్ ఈవెంట్ కారణంగానే వీరంతా.....

Published : 29 Dec 2021 23:58 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే అపార్ట్​మెంట్​కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఓ బ్యాడ్మింటన్ ఈవెంట్ కారణంగానే వీరంతా వైరస్​ బారిన పడినట్లు తెలుస్తోంది. బెంగళూరు ఓకలిపురంలోని ఓ అపార్ట్​మెంట్ వాసులు డిసెంబర్ 18న ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత కొందరు విదేశాలకు వెళ్లేందుకు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో టోర్నమెంట్‌లో పాల్గొన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 27 మందికి కరోనా పాజిటివ్​ అని నిర్ధారణ అయ్యింది. అపార్ట్​మెంట్​ కాంప్లెక్స్​లోని రెండు టవర్లలో కేసులు వెలుగుచూసినట్లు ఆరోగ్యాధికారి బాలసుందర్ వెల్లడించారు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని జిమ్​లు, స్విమ్మింగ్​ పూల్స్​తో సహా పబ్లిక్ ప్రదేశాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కొవిడ్‌ క్లస్టర్‌గా ప్రకటించింది.

కర్ణాటకలో గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్​ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. డిసెంబర్‌ 28 నుంచి 10 రోజులపాటు.. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, ప్రజలు గుమిగూడటం, డీజేలతో పార్టీలు చేసుకోవడం లాంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని