Bhabanipur: దిలీప్‌ ఘోష్‌పై దాడికి యత్నం.. తుపాకులు ఎక్కుపెట్టిన భద్రతాసిబ్బంది

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపూర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.

Published : 28 Sep 2021 01:34 IST

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపూర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నిక తేదీ సమీస్తుండటంతో భాజపా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ సమయంలో భాజపా నేత దిలీప్ ఘోష్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దాడికి యత్నించిన గుంపును చెదరగొట్టేందుకు ఘోష్ భద్రతా సిబ్బంది తుపాకులను ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి తలెత్తినట్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. 

భవానీపూర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు సోమవారం భాజపా తరఫున దిలీప్‌ ఘోష్ అక్కడకు వెళ్లారు. ప్రచార సమయంలో టీఎంసీ కార్యకర్తలు భాజపా వ్యతిరేక నినాదాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో దిలీప్‌పై వారు దాడి చేశారని భాజపా ఆరోపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడ్డారని చెప్పింది. ఆ గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరు సిబ్బంది తుపాకులు బయటకు తీసినట్లు తెలుస్తోంది. గాల్లోకి తుపాకులు ఎక్కుపెట్టినట్లు అక్కడి దృశ్యాల్లో కనిపిస్తోంది. మరో భాజపా నేత అర్జున్ సింగ్‌ కూడా తనపై దాడి జరిగినట్లు ఆరోపించారు. టీఎంసీ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. 

భవానీపూర్ ఉపఎన్నికలో దీదీ తప్పకుండా నెగ్గాల్సిన పరిస్థితి ఉంది. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఆమె భాజపా నేత సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూశారు. మరోపక్క మమతకు పోటీగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను భాజపా బరిలోకి దించింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.

సాయంత్రంలోగా నివేదిక ఇవ్వండి: ఈసీ

భవానీపూర్‌లో ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా నేత దిలీప్‌ ఘోష్‌పై కొందరు దుండుగులు దాడికి ప్రయత్నించారు. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనపై సాయంత్రం నాలుగులోగా నివేదిక ఇవ్వాలని పశ్చిమ్‌ బెంగాల్ పభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని